ఎన్పీడీసీఎల్‌కు దక్కిన అరుదైన గౌరవం


Sun,September 9, 2018 03:24 AM

-వరించిన స్కోచ్ అవార్డు
-సేద్యానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం దేశంలోనే రికార్డు
-ఉద్యోగుల్లో ఆనందం
-సంస్థకు నాలుగోసారి దక్కిన అవార్డు
-ఢిల్లీలో అందుకోనున్న సీఎండీ
వరంగల్ సబర్బన్, నమస్తే తెలంగాణ : తెలంగాణ రైతాంగానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 24 గంటల ఉచిత విద్యుత్ పథకం ఇప్పుడు ఏకంగా దేశం దృష్టిని ఆకర్శించింది. 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించినందుకు ఉత్తర విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్)కు జాతీయ స్థాయి స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు లభించింది. ఈ మేరకు శనివారం ఢిల్లీ నుంచి విద్యుత్ భవన్‌కు సమాచారం అందింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి వ్యవసాయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీడీసీఎల్, ఎన్పీడీడీసీఎల్ రెండు డిస్కంల ద్వారా 23 లక్షల పంపు సెట్లకు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. 16 జిల్లాల పరిధిలో ఎన్పీడీసీఎల్ సేవలు అందిస్తోంది. 10 లక్షల 96 వేల 612 మంది రైతులు నిరంతర విద్యుత్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ ప్రక్రియ కోసం 1281 33\11 కేవి సబ్‌స్టేషన్లను, 2231 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను, 2 లక్షల 66 వేల 213 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను నూతనంగా అమర్చారు. కొత్తగా విద్యుత్ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను సమూలంగా మార్చేశారు.

మొత్తంగా అనేక పారామీటర్లను పరిశీలించిన ఎంపిక కమిటీ ఎన్పీడీసీఎల్‌ను ఎంపిక చేసింది. దీంతో ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ స్కోచ్ ఆఫ్ మెరిట్ అవార్డు 2015లో సంస్థ చేపట్టిన జీపీఆర్‌ఎస్ ఎనేబుల్‌డ్ ఇంటిగ్రేటేడ్ స్పాట్ బిల్లింగ్‌ను ప్రవేశ పెట్టినందుకు గాను అందుకుంది. మళ్లీ 2017 సంవత్సరంలో ఇంధన పొదుపునకు సంబంధించి ఫిలమెంట్ బల్బులను ఎల్‌ఈడీ బల్బులుగా మార్చినందుకు దక్కింది. ఈ ఏడాది జూన్‌లో సౌర విద్యుత్‌ను ప్రవేశ పెట్టి సంస్థకు విద్యుత్‌ను ఆదా చేసినందుకు మూడో సారి స్కోచ్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కగా. ఇప్పుడు నాలుగోసారి వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకు దక్కడం విశేషం. ఈ అవార్డును ఈ నెల 18, 19 తేదీల్లో కాంస్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో సీఎండీ గోపాల్ రావు అందుకోనున్నారు. కాగా ఈ అవార్డు రావడం పట్ల సంస్థ డైరక్టర్లు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...