ప్రతిభ ఉన్నోళ్లను ఎవ్వరూ ఆపలేరు


Thu,November 21, 2019 12:29 AM

-ఒకప్పుడు ‘ఒక్క చాన్స్‌' కోసం ఏండ్ల పాటు ఎదురుచూపులు
-టాలెంట్‌ ఉంటే.. ‘ఓటీటీ’ అద్భుత వేదిక
-ఇండియా జాయ్‌లో వక్తలు
-హెచ్‌ఐసీసీ వేదికగా సదస్సును ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌
-ప్రత్యేక ఆకర్షణగా వీఎఫ్‌ఎక్స్‌ స్టాల్స్‌ ప్రదర్శన
-ప్రతిష్టాత్మక సినిమాలకు..వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ చేసిన సంస్థల ప్రతినిధులు హాజరు
-ఆసక్తిగా తిలకించిన విదేశీ ప్రతినిధులు
-అధిక సంఖ్యలో హాజరైన విద్యార్థులు, సినీ ప్రముఖులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:
కంటెంట్‌ ఉన్నోళ్లకు ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌)తో మంచి భవిష్యత్‌ ఉంటుందని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు. హెచ్‌ఐసీసీలో బుధవారం ఇండి యా జాయ్‌ ఎక్స్‌పోను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. గేమింగ్‌, యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌ రంగాల నిపుణులు తరలివచ్చారు. సినీ ప్రముఖులు హాజరై.. భాగ్యనగరం వేదిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ వీఎఫ్‌ఎక్స్‌ యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ అసోసియేషన్‌(టీవీఏజీఏ) ఆధ్వర్యంలో జరిగిన ఎక్స్‌పోకు విశేష ఆదరణ వచ్చింది. అంతర్జాతీయ గేమింగ్‌, యానిమేషన్‌ పరిశ్రమలు హైదరాబాద్‌ వైపునకే చూసే విధంగా ఈ ఎక్స్‌పో ఉపయోగపడనుందని నిపుణులు తెలిపారు. ఆలోచన ఉంటే అవకాశాలు అనేకం..మొత్తంగా ఇండియా జాయ్‌.. ఆయా రంగాల నిపుణులను.. దిగ్గజ కంపెనీల అధినేతలను.. ఔత్సాహిక యువత కలుసుకుని.. ఆలోచనల మార్పిడికి వేదికగా నిలిచింది.

భవిష్యత్తు అంతా ఓటీటీ దే..!!
మొదటిరోజు జరిగిన డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫెస్టివల్‌లో ఓటీటీ(ఓవర్‌ ద టాప్‌), వీఎఫ్‌ఎక్స్‌లపై సెమినార్లు నిర్వహించారు. వీఎఫ్‌ఎక్స్‌కి సంబంధించిన స్టాల్స్‌ ఏర్పాటు చేసి ఆ రంగంలో ఆసక్తి ఉన్న వారికి అవగాహన కల్పించారు. సినిమా పూర్తయ్యాక ప్రేక్షకుల ముందుకు రావాలంటే ఎంతో తతంగం ఉంటుంది.. డిస్ట్రిబ్యూటర్లు.. థియేటర్లు ఖాళీగా ఉన్నాయా? లేవా? వీటితో పాటు సీరియల్స్‌ విషయానికి వస్తే సంబంధిత చానెళ్లు ఎప్పుడు ప్రసారం చేస్తే అప్పుడే వాటిని వీక్షించే అవకాశం ఉంటుంది. అయితే శాట్‌లైట్‌, కేబుల్‌ సహకారం లేకుండా ఇంటర్నెట్‌తో నేరుగా వీక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా ఓటీటీ చేస్తోంది. ఇప్పటికే ఓటీటీలో చాలా మంది సినిమాలు, సీరీస్‌లు తీస్తూ ఖ్యాతి గడిస్తున్నారు. ఓటీటీ ప్రేక్షకులు అధిక సంఖ్యలో ఉన్నారని వ్యూ ఫౌండర్‌ విరెన్‌ తంబిదొరై అన్నారు. ఓటీటీలో అత్యధిక ప్రజాదరణ పొందిన వ్యూ.. ఇప్పుడు ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా సీక్వెల్‌ను తీయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఓటీటీలోనే విడుదలవుతుంది. దేశ వ్యాప్తంగా ఓటీటీలో హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైం, నెట్‌ఫ్లిక్స్‌, జీ5 కంపెనీల ప్రతినిధులు ఇండియా జాయ్‌కు హాజరయ్యారు.

భవిష్యత్తులో ఓటీటీ ఎలాంటి పాత్ర పోషిస్తుందో చర్చించారు. ట్యాలెంట్‌ ఉన్నవాళ్లని ఎవరూ ఆపలేరని వక్తలు కొనియాడారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఏండ్ల పాటు ఎదురుచూసేవాళ్లు. కొన్ని మంచి కాన్సెప్ట్స్‌ కూడా కనుమరుగయ్యేవి. నేడు ఆ పరిస్థితి లేదు. మన ఆలోచనను కథగా మలచి ప్రేక్షకుల వద్దకు చేర్చే అద్భుత వేదికలున్నాయి. అందులో భాగమే ఓటీటీ. ఇప్పటికే ఓటీటీలోని స్త్రీ, 99, ఫ్యామిలీ మ్యాన్‌ తదితర సినిమాలు పెద్ద నటులు లేకున్నా ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఇటీవల యారీ నంబర్‌ వన్‌ ప్రోగ్రాంలో రాణాతో బాలకృష్ణ ఎపిసోడ్‌కు టెలివిజన్‌లో రేటింగ్‌ కంటే ఓటీటీలో రేటింగ్‌ ఎక్కువ వచ్చిందని వక్తలు తెలిపారు. మొత్తంగా ఓటీటీతో సినిమా పరిశ్రమకు ఏవైన ఇబ్బందులు ఉంటాయా? వాటిని ఎలా అధిగమించాలి? ఓటీటీనే ఇక ముందు కీలక పాత్ర పోషిస్తుందా అనే విషయాలపై దర్శకులు తరుణ్‌ భాస్కర్‌ (ఈ నగరానికి ఏమైంది), మల్లిక్‌ రామ్‌(పెళ్లి గోల) తదితర దర్శకులు ఓటీటీలో స్థానిక భాషల ప్రభావంపై మాట్లాడి.. యువతకు విలువైన సూచనలు చేశారు.

వీఎఫ్‌ఎక్స్‌తో వింతైన అనుభూతి..!!
ఇండియా జాయ్‌లో వీఎఫ్‌ఎక్స్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. దేశ, విదేశాల నుంచి విసువల్‌ ఎఫెక్ట్‌ సంస్థలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. ముఖ్యంగా భారతీయ సినిమాలకు పనిచేసిన విదేశీ సంస్థలు కూడా ఇందులో భాగమయ్యాయి. మకుట, సబ్‌స్టాన్స్‌ బై ఆడబ్‌, వాక్లిటూన్‌ స్టూడియో తదితర కంపెనీలు వందకు పైగా తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. ముఖ్యంగా బాహుబలి, సైరా, రంగస్థలం, అర్జున్‌ రెడ్డి, కాలా తదితర బాలీవుడ్‌, హాలీవుడ్‌, కోలీవుడ్‌ సినిమాలకు పనిచేసిన వీఎప్‌ఎక్స్‌ సంస్థలు తరలివచ్చాయి.

వీఎఫ్‌ఎక్స్‌పై సాధారణ పౌరులకు అర్థమయ్యేలా సంబంధిత స్టాల్స్‌ ప్రతినిధులు వివరిస్తున్నారు. ఎలాంటి సినిమాలకు ఎంత సమయం తీసుకుంటారు? సన్నివేషాలకు అనుగుణంగా వీఎఫ్‌ఎక్స్‌ ఎలా సెట్‌ చేస్తారో మెళకువలు నేర్పుతున్నారు. మొత్తంగా వీఎఫ్‌ఎక్స్‌ ఎగ్జిబిషన్‌లోకి ప్రవేశిస్తే విభిన్న రకాల ఎక్విప్‌మెంట్స్‌తో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలగక మానదు. సినీ ప్రపంచంలో తిరుగుతున్నట్టుగా ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీ పరికరాలను నేరుగా చూసే వీలు కలుగుతుంది. వ్యాపార విస్తరణ.. నేరుగా కస్టమర్‌ ప్రముఖ కంపెనీలతో అనుసంధానం కావడం.. నూతన ఆలోచనలు షేర్‌ చేసుకోవడంపై సమావేశాలు జరిగాయి.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...