మన్సూరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో త్వరలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతలపై తీసుకోవల్సిన అంశాలపై ప్రజలకు, వాహనదారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ జితేందర్ తెలిపారు. ఎల్బీనగర్లోని ట్రాఫిక్ కాంప్లెక్స్ ప్రాంగణంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా హీరో మోటోకార్ప్ లిమిటెడ్ సంస్థ సహకారంతో సుమారు రూ.70 లక్షలతో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ ట్రాఫిక్ ట్రైనింగ్ పార్కును సోమవారం రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జితేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రోడ్డు భద్రతల విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకుని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టిందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రతి సంవత్సరం 7వేల మంది చనిపోతున్నారని.. ఇందులో 45శాతం మంది 35నుంచి 40ఏండ్లలోపు వారేనని తెలిపారు. రోడ్డు భద్రతలపై అవగాహన కల్పించేందుకు హీరో మోటోకార్ప్ సంస్థ ఇప్పటికే గోషమహల్, బేగంపేటలో చిల్డ్రన్స్ ట్రాఫిక్ ట్రైనింగ్ పార్కులను ఏర్పాటు చేశారని.. ఎల్బీనగర్లో ప్రస్తుతం ఏర్పాటు చేసింది మూడో ట్రాఫిక్ ట్రైనింగ్ పార్కు అని తెలిపారు. చిల్డ్రన్స్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో తెలుసుకున్న అంశాలను విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా చూడాలని సూచించారు. నిబంధనలు పాటించకపోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్లు సూసైడ్ బాంబర్ లాంటి వారని.. వారు నష్టపోవడమే కాకుం డా ఎదుటి వారిని ఇబ్బందుల పాలు చేస్తారని తెలిపారు. తెలంగాణ పోలీసులు స్టాండెడ్ ఆపరేటింట్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను అమలు చేయ డం వల్ల రాష్ట్రంలో రోడ్డు సేఫ్టీ పెరగడంతో పాటు డ్రంకన్ డ్రైవ్ కేసులు బయట పడుతున్నాయని ఆయన తెలిపారు.
నిబంధనలపై అవగాహన కల్పిస్తాం: మహేశ్‌భగవత్
విద్యార్థులకు క్యాంపులను నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతల విషయంలో అవగాహన కల్పిస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌భగవత్ తెలిపారు. అనంతరం పార్కులో వారు మొక్కలు నాటారు. కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ అదనపు సీపీ సుధీర్‌బాబు, హీరో మోటోకార్ప్ సీఎస్ఆర్ సలహాదారు రాజేష్ముఖిజా, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి, ఎల్బీనగర్ ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్రావు సింక్రోని ఆర్గనైజేషన్ ప్రతినిధి వెంకట్ పాల్గొన్నారు.