సైబర్ నేరగాళ్లచేతికి.. సిమ్‌కార్డులు!


Wed,November 20, 2019 12:53 AM

తెలంగాణ: సైబర్ నేరగాళ్లకు సిమ్‌కార్డులు సరఫరా చేస్తున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన వ్యాపారులపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టారు. అమాయకులను మోసం చేసేందుకు ఉపయోగిస్తున్న సిమ్‌కార్డుల గురించి పోలీసులు ఆరా తీశారు. ఎక్కువగా పశ్చిమబెంగాల్‌లో రిజిస్టర్ అయిన సిమ్‌కార్డుల నుంచి ఇటీవల కాల్స్ ఎక్కువగా వస్తున్నట్లు పోలీసులు గుర్తించి .. మూలాలు ఎక్కడున్నాయనే విషయాన్ని తెలుసుకున్నారు. ఒకే వ్యాపారి 600 సిమ్‌కార్డులను విక్రయించినట్లు పోలీసులకు సమాచారం అందింది. సైబర్‌నేరగాళ్ల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న సదరు వ్యాపారి ఒక్కో సిమ్‌కార్డుకు రూ. 1000 నుంచి రూ. 2 వేల వరకు విక్రయించాడు. ఈ సిమ్‌కార్డులను ఉపయోగిస్తూ పోలీసులకు దొరకకుండా సైబర్‌నేరగాళ్లు దేశ వ్యాప్తంగా రెచ్చిపోతున్నారు.

ఫొటో ఒక్కటే.. పేర్లు వేరు
పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ సిమ్‌కార్డు డిస్ట్రిబ్యూటర్.. తన వ్యాపారాన్ని రెట్టింపు చేయాలనుకున్నాడు. అతని వద్దకు వచ్చే సాధారణ పౌరులకు సంబంధించిన ఆధార్‌కార్డులను మార్చి, అందులో తన ఫొటో పెట్టాడు. ఆ కార్డులు ఉపయోగించి రోజుకు కొన్ని సిమ్‌కార్డులు తీసుకున్నాడు. అయితే ఫొటో తనది..చిరునామాలు, ఆధార్‌కార్డు నంబర్లు ఇతరులవి ఇస్తూ .. సుమారు 600కుపైగా సిమ్‌కార్డులను తీసుకున్నాడు. ఆ తరువాత వాటిని సైబర్‌నేరగాళ్లకు అమ్మేశాడు. చిరునామా, ఫొటో తమది కాదు.. దీంతో పోలీసులకు దొరికే అవకాశమే ఉండదనే ఉద్దేశ్యంతో సైబర్‌నేరగాళ్లు.. యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. పశ్చిమబెంగాల్ కేంద్రంగా జరుగుతున్న ఈ సిమ్‌కార్డుల విక్రయాలపై సైబర్ క్రైమ్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటిని అదుపు చేసేందుకు సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు.
ఇటీవల సైబర్‌నేరగాళ్లను పట్టుకోవడానికి సైబర్‌క్రైమ్ పోలీసులు పశ్చిమబెంగాల్‌కు వెళ్లారు. అయితే సైబర్‌నేరగాళ్లకు సంబంధించిన చిరునామాలు ఉన్న ప్రాంతాల్లో ఇటీవల వచ్చిన బుల్ బుల్ తుఫాను ప్రభావం కూడా ఉండడంతో అక్కడి అధికారులు ఆయా ప్రాంతాలను ఖాళీ చేయించారు. దీంతో మన పోలీసులు మరోసారి ఈ నేరస్థ్ధులను పట్టుకోవడం కోసం ప్రత్యేక కార్యచరణతో వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు సిమ్‌కార్డుల విక్రయదారులపై చర్యలు తీసుకుంటే.. మరికొందరి సిమ్ కార్డుల విక్రేతల్లో భయం ఉంటుందని సైబర్‌క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. అక్కడి పోలీసుల సహకారంతో ఇలాంటి వారి ఆటలు అరికట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles