సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఈవెంట్స్ నిర్వహించేవారు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని, నిబంధనలు పాటించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నిర్వాహకులకు సూచించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్స్, ఆన్లైన్ టిక్కెట్ల విక్రయదారులు, ఈవెంట్ల తో ప్రజలు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ బుధవారం వాటి నిర్వాహకులతో సమావేశమయ్యారు. చాలా మంది నిర్వాహకులు పోలీస్, ఎైక్సెజ్, అగ్నిమాపక శాఖ అనుమతులు లేకుండానే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు. దీంతో ఈవెంట్స్ సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంటుందని సీపీ వివరించారు. మరో వైపు వాహనాల పార్కింగ్‌కు సరైన చర్యలు తీసుకోకపోవడంతో రోడ్లపై వాహనాలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతున్నాయి. ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమాలను నిర్వహించి పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.