రూ.2500 కోట్ల రుణం


Fri,October 18, 2019 04:05 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ) పనుల కోసం జీహెచ్‌ఎంసీ వివిధ ఆర్థిక సంస్థల నుంచి రూ.2500కోట్ల రుణం
(టర్మ్ లోన్) సేకరించాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి బాండ్ల మార్కెట్ మెరుగ్గా లేకపోవడంతోపాటు బాండ్లకన్నా తక్కువ వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తుండడంతో రుణం తీసుకునేందుకు బల్ది యా మొగ్గు చూపుతున్నది. రుణం ఇచ్చేందుకు ఇప్పటికే పలు బ్యాంకులు ముందుకు రాగా, త్వరలో ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు ఆహ్వానించి తక్కువ వడ్డీకి రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చే బ్యాంకు నుంచి రుణం సేకరించాలని నిశ్చయించారు. ఎస్‌బీఐ క్యాప్స్‌ను రూ. 0.10 శాతం ఫీజుపై అరేంజర్‌గా నియమించారు. స్థానిక సంస్థలు ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొం తంగా నిధులు సమకూర్చుకోవాలన్న సంకల్పంతో జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ పనులకు రూ.3500 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బాండ్ల జారీ ద్వారా రూ.1000కోట్లు, టర్మ్‌లోన్ ద్వారా మరో రూ.2500కోట్లు సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. బాండ్ల ద్వారా ఇప్పటికే మూడు విడుతల్లో రూ.495కోట్లు సేకరించారు. అయితే ప్రస్తుతం బాండ్ల మార్కెట్ అంత సానుకూలంగా లేకపోవడంతోపాటు వడ్డీ భారం అధికంగా ఉండడంతో రూపీ టర్మ్‌లోన్ ద్వారా 2500కోట్ల రుణం తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. మొదటి విడుతలో బాండ్ల ద్వారా రూ.200కోట్లు 8.9శాతం వడ్డీరేటుపై సేకరించగా, రెండో విడుతలో 9.38వడ్డీ రేటుపై మరో రూ. 195కోట్లు సమీకరించారు.

గత ఆగస్టులో మూడవ విడుతలో రూ.10.23శాతం వడ్డీకి రూ.100కోట్లు సేకరించడం విశేషం. అంతేకాదు, మూడవ విడుతలో రూ. 200 కోట్లు సేకరించాలని నిర్ణయించినప్పటికీ కేవలం రూ.100కోట్లు మాత్రమే లభించడం గమనార్హం. దీంతో బాండ్ల మార్కెట్ అంతగా సానుకూలంగా లేదని నిర్ణయానికొచ్చిన జీహెచ్‌ఎంసీ, బ్యాంకుల ద్వారా రుణం సేకరించాలని నిర్ణయానికొచ్చింది. ఇదిలావుంటే, రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు క్యూ కడుతున్నాయి. ఎస్‌బీఐతోపాటు పలు ప్రైవేటు బ్యాంకులు ఇప్పటికే 8శాతం కన్నా తక్కువ వడ్డీరేటుకు రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే మరింత తక్కువ వడ్డీకి రుణం పొందాలని జీహెచ్‌ఎంసీ భావిస్తున్నది. రుణ సేకరణకు ఇదివరకే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్థాయీసంఘం అనుమతి తీసుకొని ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు ఆహ్వానించాలని నిశ్చయించారు. దీనివల్ల బ్యాంకుల మధ్య పోటీ ఏర్పడి తమకు మరింత తక్కువ వడ్డీకి రుణం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్‌ఆర్‌డీపీ పనులకే ఈ నిధులను వెచ్చించనున్నట్లు పేర్కొంటున్నారు. పనులు అంతరాయం లేకుండా కొనసాగాలంటే నిధుల సేకరణ తప్పదని వివరించారు. కాగా, జీహెచ్‌ఎంసీ దేశంలోనే బాండ్ల ద్వారా అత్యధిక నిధులు సేకరించిన కార్పొరేషన్లలో మొదటి కార్పొరేషన్‌గా ఖ్యాతిని దక్కించుకున్నది. తాజాగా ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా సొంతంగా రుణం సేకరించి మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకునే అవకాశముంది.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...