ఉన్నతస్థాయి ఉద్యోగమంటూ టోకరా


Sun,October 13, 2019 01:28 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అణువిద్యుత్‌ శాఖ రిటైర్డ్‌ ఉద్యోగికి సైబర్‌ చీటర్లు భారీ టోకరా పెట్టారు. విదేశాల్లో హోటల్‌ చీఫ్‌ మేనేజర్‌ ఉద్యోగమంటూ... రూ.47 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో నైజీరియా దేశానికి చెందిన సైబర్‌ క్రిమినల్స్‌ను శనివారం సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరికి సహకరించిన నాగాల్యాండ్‌కు చెందిన మహిళను కూడా పట్టుకున్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ వివరాలు వెల్లడించారు..
కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన వి.రాజన్‌ బాబు 2002 లో అణువిద్యుత్‌ శాఖలో పదవీ విరమణ పొందాడు. ఆ తర్వాత పలు కార్పొరేట్‌ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేశాడు. ప్రస్తుతం ఒడిశాలోని పట్నాయక్‌ స్టీల్స్‌ అండ్‌ అలయిస్‌ లిమిటెడ్‌ కంపెనీ సీఈఓగా పని చేస్తున్నాడు.

అయితే... రాజన్‌ బాబుకు కార్పొరేట్‌ సంస్థల్లో ఉన్నతస్థాయి హోదాల్లో పనిచేసి భారీ జీతభత్యాల ప్యాకేజీ పొందాలనే కోరిక ఉంది. ఈ క్రమంలో 7 సంవత్సరాలుగా ఏడు దేశాల్లో పనిచేశాడు. విదేశీ కంపెనీల్లో ఉన్నతస్థాయి ఉద్యోగం చేయాలనుకుని .. పలు జాబ్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. కాగా.. జనవరిలో కాలిఫోర్ణియాలో రొగ్గల్‌ హోటల్‌ సీఈఓ హీతర్‌ విలియమ్స్‌ పేరుతో గుర్తు తెలియని వ్యక్తి.. అతనికి ఫోన్‌ చేసి మీ దరఖాస్తుకు స్పందిస్తున్నాం... మా హోటల్‌లోని చీఫ్‌ మేనేజర్‌ పోస్టుకు మిమ్ములను ఎంపిక చేశాం... త్వరలో మీకు ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పా డు. ఫిబ్రవరిలో హీతర్‌ విలియమ్స్‌ భార్యగా పేర్కొంటూ ఓ మహిళ ఫోన్‌ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేందుకు బోస్టన్‌ నుంచి ఇండియాకు వచ్చాను... ప్రస్తుతం బ్రిటీష్‌ కాన్సులేట్‌ కార్యాలయంలో బస చేశానని చెప్పింది. మరుసటి రోజు ఫోన్‌ చేసి మిమ్మల్ని ఎంపిక చేశామని చెప్పింది.

మరో రెండు రోజులు తర్వాత అకిత కుమారి పేరుతో రాజన్‌బాబుకు ఫోన్‌ వచ్చింది... మీకు ఉద్యోగం ఖాయమైంది.. దానికి సంబంధించి హితర్‌ విలియమ్స్‌ భార్య... మీ ఏడాది జీతానికి సంబంధించి దాదాపు 1.75 డాలర్లు(దేశీయ కరెన్సీలో 1.22 కోట్లు) డీడీ తీసుకువచ్చింది... అది డ్రా కావాలంటే మీరు రూ.55 వేలు ప్రాసెసింగ్‌ ఫీజు కింద చెల్లించాలని సూచించింది. అనంతరం మరో వ్యక్తి బ్రిటీష్‌ కాన్సులేట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ అధికారిని మాట్లాడుతున్నానంటూ.. మీ జీతం డబ్బు వారంలో డ్రా అవుతుందని నమ్మించాడు. ఇలా.. మొత్తం రాజన్‌ బాబు నుంచి పలు దఫాలుగా రూ.47 లక్షలను కాజేశారు. చివరికి ఇది మోసమని గ్రహించిన రాజన్‌బాబు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి... ఈ మోసానికి పాల్పడింది నైజీరియన్‌ ముఠా అని తేల్చి .. వారిని శనివారం అరెస్ట్‌ చేశారు. ఈ మోసంలో మొత్తం ఆరుగురి పాత్ర ఉండగా.. నలుగురిని అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి నాలుగు పాస్‌పోర్టులు, ల్యాప్‌టాప్‌, డెబిట్‌కార్డులు, బ్యాంకు లో ఉన్న రూ.11 లక్షలను ఫ్రీజ్‌ చేశారు. యూకే, నైజీరియా, టాంజానియా దేశాలకు చెందిన 10 సిమ్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

ముఠా సభ్యుల వివరాలు ఇలా ...
డియోంగ్యు మహమ్మద్‌ : ఈ మోసానికి పథకం రచించిన ప్రధాన సూత్రధారి. ఇండియాకు సెనాగల్‌ పాస్‌పోర్టు మీద.. తన పేరును డోనాల్డ్‌గా మార్చుకుని టూరిస్ట్‌ వీసా మీద 2018లో వచ్చాడు. కార్పొరేట్‌ సంస్థలు, విదేశాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి డేటాబేస్‌ను కొనుగోలు చేసి... మోసం చేస్తున్నాడు

ముసా హాలిమత్‌ : మెడికల్‌ వీసామీద 2016లో భారత దేశానికి వచ్చింది. ప్రధాన సూత్రధారి డియోంగ్యూ మహమ్మద్‌కు ప్రియురాలు. వీరి వలలో చిక్కిన బాధితులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు కాలిఫోర్ణియా నుంచి ఇండియాకు వచ్చానని నమ్మిం చి బోల్తా పడేస్తుంది.

బెనిడిక్ట్‌ ఎనెబులెలె : ఇతను నైజీరియా దేశస్థుడు. భారత దేశానికి సెనాగల్‌ పాస్‌పోర్టులో పేరు మార్చుకుని టూరిస్ట్‌ వీసా మీద 2018లో వచ్చాడు. ఈ ముఠాలో చేరి.. నకిలీ మెయిల్స్‌ సృష్టించడంతో దిట్ట. బాధితుల నుంచి మాట్లాడేందుకు యూకే మొబైల్‌ నం బర్‌ ద్వారా నిత్యం వాట్సాప్‌ కాల్స్‌, చాటింగ్‌లో మాట్లాడుతూ వారిని మాయ చేస్తాడు.

హొలిటొ జింమోమి @ అకితా కుమారి : ఈమె నాగాల్యాండ్‌ చెందింది. 2019 మార్చి లో నైజీరియన్‌కు చెందిన ఫ్రాన్సిస్‌ అగాహహోన్‌ను పెండ్లి చేసుకుంది. ముఠాలో చేరి అకితా కుమారి పేరుతో బాధితులతో మాట్లాడి వారితో నగదును డిపాజిట్‌ చేసేలా మాయ చేస్తుంది. అలాగే మరో ఇద్దరు నిందితులు పెటోసైల్‌ ఉగా, శామ్‌సన్‌ విలియమ్స్‌లు ప్రధాన సూత్రధారికి బ్యాంకు ఖాతాలను అందిస్తూ... బాధితుల నగదును డిపాజిట్‌ అయిన వెంటనే డ్రా చేసి కమీషన్‌ల మీద గ్యాంగ్‌ లీడర్‌ పంపిస్తారు. ప్రస్తుతం ఈ ఇద్దరు పరారీలో ఉన్నారు. కేసును ఛేదించిన సిబ్బందని సీపీ సజ్జనార్‌ అభినందించి, రివార్డులను అందించారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...