చెత్తనూ కొంటారు..


Sun,October 13, 2019 01:27 AM

మేడ్చల్‌ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : పల్లెలలో జఠిలంగా మారుతున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మేడ్చల్‌ జిల్లాలో వడివడిగా అడుగులు పడుతున్నాయి. పట్టణాలతో పాటు హైదరాబాద్‌ మహానగర శివారులోని మేడ్చల్‌ జిల్లాలోని పంచాయతీలకు సవాల్‌గా మారిన చెత్త సేకరణ ప్రక్రియకు త్వరలోనే శాశ్వత విముక్తి లభించనున్నది. గ్రామంలో సిబ్బంది సేకరించిన చెత్తను ఎక్కడ వేయాలో తెలియక సతమతమవుతున్న పంచాయతీలకు ఇక నుంచి పైసలిచ్చి మరీ చెత్తను కొనుగోలు చేయనున్నారు. ఇందుకు ఓ ప్రైవేటు ఏజెన్సీ ముందుకు వచ్చింది. గ్రీన్‌ టిబ్యునల్‌ ఆదేశాలు, జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి చొరువ, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్‌ పర్యవేక్షణలో మేడ్చల్‌ జిల్లా పరిధిలోని 61 గ్రామాల్లో 21 క్లస్టర్ల ద్వారా ప్రయోగాత్మకంగా ఓ ఏజెన్సీ చెత్తను కొనుగోలు చేయనున్నది. ఇప్పటికే జిల్లా అధికారులతో ఈ మేరకు ఒప్పందం జరుగగా, రెండు మూడు వారాల్లోనే చెత్త గొనుగోలు ప్రక్రియను షురూ చేసేందుకు పంచాయతీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

21క్లస్టర్ల ద్వారా చెత్త సేకరణ
జిల్లా పరిధిలోని మొత్తం 61 గ్రామాలుండగా, వీటిని 21 క్లస్టర్లుగా (మేడ్చల్‌లో-6, ఘట్‌కేసర్‌లో-4, శామీర్‌పేట్‌లో-4 కీసరలో-3, మూడేచింతలపల్లిలో-4) క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ముందస్తుగా ప్రతి ఇంటికీ తడి చెత్తను వేసేందుకు ఓ డస్ట్‌బిన్‌ను, పొడి చెత్తను వేసేందుకు ఓ బ్యాగును గ్రామంలోని ప్రతి ఇంటికి ఉచితంగా ఇవ్వనున్నారు. అనంతరం ప్రతి ఇంటి నుంచి పంచాయతీ సిబ్బంది ద్వారా గ్రామం మొత్తంలో సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డుకు కాకుండా నేరుగా ఓ ట్రాక్టర్‌, చెత్త తరలింపు వాహనం ద్వారా సమీపంలోని క్లస్టర్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి జిల్లాలో సుమారు 5-6లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన చెత్త సేకరణ కేంద్రం (షెడ్డు)కు తరలించి అక్కడ తడి, పొడి చెత్తను, ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేరు చేసి ఏజెన్సీకి సంబంధించిన చర్లపల్లి పారిశ్రామిక వాడలోని పరిశ్రమకు ఏ రోజుకు ఆరోజు తరలించి తడి చెత్తను రీసైక్లింగ్‌ చేసి సేంద్రీయ ఎరువులుగా, విద్యుత్‌ ఉత్పత్తికి, పొడి చెత్తను సిమెంట్‌ పరిశ్రమలకు, ప్లాస్టిక్‌ ఉత్పత్తుల పరిశ్రమలకు తరలించనున్నారు.

10 గ్రామాల్లో షెడ్ల నిర్మాణం పూర్తి
గ్రామంలో సేరించిన చెత్తను వేసేందుకు గ్రామ శివారులో ప్రతి గ్రామంలో షెడ్డును నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లా పరిధిలోని బోగారం, పొన్నాల్‌, బొమ్మరాశిపేట, మునీరాబాద్‌, ఔషాపూర్‌, సోమారం, కొర్రెముల, కేశవరం, గోదుమకుంట, కాచవానిసింగారం గ్రామాల్లో షెడ్డు నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రతి గ్రామం లో సేకరించిన చెత్తను క్లస్టర్‌కు తరలించే సమయంలో తూకం వేస్తారు. ఇందులో తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా తూకం వేసి ఏ పంచాయతీలో ఎంత చెత్తను సేకరించిన విక్రయించారో ఏజెన్సీ ప్రతినిధులతో పాటు పంచాయతీ సిబ్బంది లెక్క రాయనున్నారు. ఇలా ప్రతిరోజు సేకరించిన చెత్తను ఏజెన్సీకి విక్రయించి ప్రతి నెల ఏజెన్సీ నుంచి చెత్త ద్వారా వచ్చిన డబ్బులను గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేసి, ఈ చెత్త ద్వారా వచ్చిన నిధులను చెత్త సేకరణలో, క్లస్టర్లలో తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు నియమించిన సిబ్బందికి వేతనాలను ఇవ్వడంతో పాటు గ్రామాభివృద్ధి పనుల కోసం వెచ్చిస్తామని జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్‌ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.

తగ్గనున్న దుర్వాసన.. వాయుకాలుష్యం
ప్రస్తుతం గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది సేకరించిన చెత్తను గ్రామ శివారులో ఏర్పాటు చేసిన గ్రామ డంపింగ్‌ యార్డులో వేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా నిండగానే ఆ చెత్తకు నిప్పు పెట్టి మంట పెడుతున్నారు. దీంతో ప్రతిరోజు చెత్త నుంచి వెలువడే దుర్గంధంతో పాటు పొగ కారణంగా ఏర్పడుతున్న వాయుకాలుష్యంతో గ్రామాల ప్రజలు సతమత మవుతున్నారు. ఇక నుంచి గ్రామ ప్రజలకు ఇలాంటి ఇబ్బందులుండవని, గ్రామాల్లో దుర్వాసన, వాయుకాలుష్యం పూర్తిగా తగ్గుతుందని పంచాయతీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గాలిదుమారం వచ్చినప్పుడు డంపింగ్‌ యార్డుల్లోని చెత్త వచ్చి రోడ్డుపై, ఇండ్లముంగిట పడుతుండటంతో పారిశుధ్య సమస్యలు నిత్యాకృత్యమయ్యాయి. ఇక నుంచి గ్రామంలో చెత్తను ఏ రోజుకారోజు తరలిస్తుండటంతో అసలు గ్రామంలో చెత్త సమస్యే ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...