చెక్కు చెదరొద్దు..గుంతలు పడొద్దు


Sat,October 12, 2019 02:46 AM

- మరమ్మతుల నాణ్యతలో రాజీ పడేదే లేదు
- రోడ్డు బాగుంటేనే..డబ్బులిస్తారు
- నిర్వహణ బాధ్యతలు ఇక ప్రైవేటు ఏజెన్సీలకు
- బల్దియా నూతన విధానం రూపకల్పన
- నవంబర్ 1 నుంచి పనులు
- ప్రయోగాత్మకంగా 687 కిలోమీటర్ల అప్పగింత
- ఒక్కోజోన్‌లో 200 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగర రోడ్ల నిర్వహణపై ప్రతీసారి విమర్శలు ఎదుర్కొంటున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ సారి పాత పద్ధతులకు స్వస్తి పలకనున్నది. రోడ్లు చెక్కు చెదరకుండా ఉండేలా గుంతలు పడకుండా నిర్వహణ జరిగేలా కొత్త విధానానికి శ్రీకారం చుట్టనున్నది. ఇకపై రహదారుల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే దిశగా విధివిధానాలు తయారు చేస్తున్నారు. ఈ మేరకు బల్దియా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

ఏటా 850 కోట్ల ఖర్చు
నగరంలో 9 వేల కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు వాటికి అనుసంధానంగా అంతర్గత రహదారులు ఉన్నాయి. వీటి అభివృద్ధి, నిర్వహణ, మరమ్మతులకు జీహెచ్‌ఎంసీ ఏటా సుమారు రూ.850 కోట్లు ఖర్చు చేస్తున్నది. అయినా ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. వేసిన కొద్ది రోజులకే రోడ్లు పాడవడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లపై ఉన్న గుంతలు నీటితో నిండిపోయి ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్నది. వాహనదారులు పలు రకాల ఆరోగ్య సమస్యలకు గురి కావడమే కాకుండా రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. రోడ్ల అధ్వానస్థితిపై పలు సందర్భాల్లో న్యాయస్థానాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రోడ్ల పరిస్థితిని సమూలంగా మార్చాలని సంకల్పించింది. ఏన్నో ఏండ్లుగా సాగుతున్న ఈ పద్ధతికి పూర్తిగా స్వస్తిపలికి నూతన విధానానికి నాంది పలికేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జాతీయ రహదారుల తరహాలో.. నాణ్యంగా ఉండేలా రోడ్ల మరమ్మతుల్లో జవాబుదారీతనం తీసుకురావడం ద్వారా ప్రజలు చెల్లిస్తున్న పన్నులకు సరైన న్యాయం చేయాలని బల్దియా నిర్ణయించింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం సందర్భంగా రోడ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలన్న నిర్ణయాన్ని ప్రకటిస్తూ దీనికి అవసరమైన విధివిధానాలు తయారు చేయాలని ఆదేశించారు.


జాతీయ రహదారుల తరహాలోనే నగర రోడ్లు కూడా చెక్కు చెదరకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రోడ్లు బాగుంటేనే బిల్లులు చెల్లించేలా విధివిధానాలు రూపొందించారు. ఈ నేపథ్యంలో అధికారులు సరికొత్త విధానాలతో ప్రతిపాదన సిద్ధం చేశారు. హెచ్‌ఏఎం(హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండేండ్లున్న డిఫెక్ట్ లయబులిటీ పీరియడ్(డీఎల్‌పీ)ని ఐదేండ్లకు పెంచడమే కాకుండా బిల్లులు పది శాతానికి బదులు 40 శాతం ఆపుకోవాలని నిర్ణయించారు. అంటే, పనులు పూర్తయ్యే వరకు కేవలం 60 శాతం బిల్లులు మాత్రమే చెల్లించి మిగిలిన 40 శాతం బిల్లులు ఐదేండ్లలో క్రమక్రమంగా చెల్లిస్తారన్నమాట. ఒకవేళ వారు సక్రమంగా నిర్వహించకుంటే తదుపరి బిల్లులు మంజూరు చేయకుండా పకడ్బందీగా నిబంధనలు రూపొందించారు. ముందుగా ప్రయోగాత్మకంగా రూ.1300 కోట్లతో 687 కిలోమీటర్ల మేర ప్రధాన రోడ్లను ఐదేండ్లపాటు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని, నవంబర్ 1వ తేదీ నుంచి పనులు ప్రారంభించాలని నిర్ణయించారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles