సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్నాయని, అందులో భాగంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నామని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా 6వ తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు తెలుగు, ఇంగ్ల్లిష్, ఉర్దూ భాషల్లో ఈ పోటీలు గోషామహల్‌లోని ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పోలీసు వారు చేయు పనేంటీ? నీవు వారి నుంచి ఏమి ఆశిస్తున్నావు? అనే అంశంపై మూడు భాషల్లో వ్యాస రచన పోటీలు 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు, దేశోద్దరణలో పోలీసు పాత్ర అనే అంశంపై మూడు బాషాల్లో ఉపన్యాస పోటీసులు 18వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సర్వీస్ అఫ్ పోలీస్ అనే అంశంపై మూడు భాషల్లో పెయింటింగ్ పోటీలు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12. గంటల వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మొదటి బహుమతి రూ. 5 వేలు, రెండో ఫ్రైజ్ రూ. 3 వేలు, మూడో ఫ్రైజ్ రూ. 2 వేల చొప్పున 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బహుమతుల ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. పోటీలకు హాజరయ్యే విద్యార్థులు పెన్సిల్, స్కెచ్, స్కేల్స్, ప్యాడ్, కలర్స్ తదితర స్టేషనరీ వస్తువులను తమ వెంట తెచ్చుకోవాలని, నిర్వాహకులు పెయింటింగ్ పోటీల్లో పాల్గొనే వారికి డ్రాయింగ్ పేపర్లను అందిస్తారని వెల్లడించారు. ఈ పోటీలకు సంబంధించిన ఎదైనా సం దేహం, ఇతర సమాచారం కోసం ఇన్స్పెక్టర్, హరీశ్ (9490616063)ని సంప్రదించాలని అదనపు సీపీ సూచించారు.