ప్రక్షాళనతో.. ప్రమాదాలకు చెక్


Fri,October 11, 2019 03:37 AM

-బ్లాక్ స్పాట్స్ వద్ద మరమ్మతులు
-యువతకు డ్రైవింగ్‌పై అవగాహన
-ఫుట్‌పాత్‌ల పునర్నిర్మాణం
-యాక్సిడెంట్ ఫ్రీ సిటీ లక్ష్యంతో ముందడుగు
-గతేడాదితో పోలిస్తే తగ్గిన ప్రమాదాలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చేపట్టిన పలు కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 2019 కోసం పెట్టుకొన్న యాక్సిడెంట్ ఫ్రీ సిటీ లక్ష్యానికి దగ్గరవుతున్నారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలు, పాదచారుల మరణాలను తగ్గించాలన్న ప్రయత్నం ఫలించింది. వాహనదారులు, పాదచారుల మరణాలను దాదాపు 28 శాతం వరకు తగ్గించగలిగారు. దీని కోసం 2018లో చోటు చేసుకున్న సంఘటనలను విశ్లేషించిన అధికారులు ప్రమాదాలకు నిలయంగా మారిన దాదాపు 80 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించారు. అంతేకాకుండా సురక్షిత ప్రయాణం కోసం దాదాపు వేలాది మంది యువతకు, వాహనదారులకు అవగాహన కల్పించి వారిలో క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్‌ను అలవాటు చేశారు. ఇలా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గతేడాది జరిగిన మరణాలను పోలిస్తే ఈ 9 నెలల్లో దాదాపు 42 ప్రాణాలను కాపాడటంతో పాటు సుమారు 26 ప్రమాదాలను తగ్గించగలిగినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన శాఖలు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఆర్‌డీసీఎల్, ఆర్‌అండ్ బీ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో సమన్వయం చేసుకొని రోడ్డు ప్రమాదాల బ్లాక్ స్పాట్స్‌లలో మరమ్మతులు చేపట్టారు. దీంట్లో భాగంగా బోయిన్‌పల్లి చెక్ పోస్టు ఎంఎంఆర్ గార్డెన్స్ దగ్గర గార్డ్ రెయిలింగ్‌ను నిర్మించడం, టిప్పు ఖానా-రాందేవ్‌గూడ రోడ్డు వీధి దీపాలు, రోడ్డు మార్కింగ్స్‌ల ఏర్పాటు, రాజ్‌భవన్ రోడ్డులోని సెంట్రల్ మీడియన్ వద్ద పాదచారుల గార్డ్ రెయిలింగ్, మిథాని దత్తునగర్ వద్ద సెంట్రల్ మీడియన్ నిర్మాణం, మెట్రో రైలు స్టేషన్స్ వద్ద సూచిక బోర్డులు, ఫ్లెక్సీలతో పాదచారులు రోడ్డును సురక్షితంగా దాటేందుకు జాగ్రత్తలను సూచించారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని ఫుట్‌పాత్‌ను పునర్‌నిర్మించారు. టోలీచౌకీ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో రోడ్డు భద్రతకు సంబంధించిన సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. అంతేకాకుండా ఈ ఏడాది దాదాపు 174 విద్యాసంస్థల్లో దాదాపు 88,721 విద్యార్థులకు సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలైన డ్రంకన్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, మైనర్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్‌రూట్ డ్రైవింగ్, అధిక ప్రయాణికులతో ప్రయాణం, సీటు బెల్టు, హెల్మెట్ లేకుండా, సిగ్నల్ జంపింగ్ అంశాలపై చట్టపరమైన చర్యలను అమలు చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలను నివారించగలిగారు. ఈ జూలై వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలపై కూడా విశ్లేషించిన అధికారులకు పలు కారణాలు వెలుగులోకి రావడంతో వాటి వద్ద కూడా పలు అడ్డంకులను తొలగించారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles