రండి.. పర్యావరణాన్ని కాపాడుదాం !


Fri,October 11, 2019 03:36 AM

-ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల శిక్షణపై చిన్నారులకు ఆహ్వానం
-పలు వస్తువుల తయారీపై నిష్ణాతులతో అవగాహన
-నేడు హైటెక్స్‌లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం
హైదర్‌నగర్ : పర్యావరణ పరిరక్షణలో చిన్నారులను భాగస్వాములను చేసేందుకు బల్దియా శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ అధికారులు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం చిన్నారులకు వినోదంతో పాటు పర్యావరణంపై అవగాహన కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వెస్ట్ జోన్ పరిధిలోని హెటెక్స్ ఎరీనాలో మధ్యాహ్నం 3 గంటల నుంచి అభ్యసన.. పర్యావరణ ఉత్పత్తుల తయారీపై నిష్ణాతులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇందు కోసం చిన్నారులందరినీ ఆహ్వానిస్తున్నారు. ఆసక్తిగల తల్లిదండ్రులు తమ చిన్నారులతో ఈ కార్యక్రమానికి హాజరుకావాలని, వారిని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేయాలని విన్నవించారు. దీనికి తోడు ప్రత్యేక శిక్షణ ద్వారా ప్రతీ పాఠశాల నుంచి పర్యావరణ సైనికులను తయారు చేయాలని, వారందరి ద్వారా ఈ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయించాలని వెస్ట్ జోన్ అధికారులు నిర్ణయించారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ వినూత్న కార్యక్రమానికి బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిసింది. ఆటపాటలు, అభ్యసనతో సాగే ఈ శిక్షణ కార్యక్రమాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని ఇప్పటికే అధికారులు పిలుపునిచ్చారు.

అంశాల్లో శిక్షణ..
హైటెక్స్ పీనిక్స్ ఎరీనాలో శుక్రవారం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానంగా ఆరు పర్యావరణ హితమైన అంశాలపై చిన్నారులకు అధికారులు శిక్షణ ఇప్పించనున్నారు. వీటిలో దియా పెయింటింగ్, పేపర్ బ్యాగ్ తయారీ, సబ్బుల తయారీ, పాత వస్ర్తాలతో బ్యాగుల తయారీ, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ విధానం, వీలైనంతగా ప్లాస్టిక్‌ను నిర్మూలించటం వంటి అంశాలపై నైపుణ్యం కలిగిన నిష్ణాతులతో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తారు. అభ్యసనతో పాటు కొంత మేర అక్కడికక్కడే పర్యావరణ ఉత్పత్తులను సైతం చిన్నారులతో తయారు చేయిస్తారు. ఇలా చేసే ఈ ప్రయత్నాన్ని ఒక్క రోజుతో కాకుండా జోన్ వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు విస్తరించి వందలాదిగా పర్యావరణ చిన్నారి సైనికులను తయారు చేయాలని వెస్ట్ జోన్ కమిషనర్ దాసరి హరిచందన దృఢ నిశ్చయంతో ఉన్నారు. చిన్నారులలో ఆలోచనను కల్పించటం ద్వారా పకడ్బందీగా అమలు చేయించాలని నిర్ణయించారు. చాలా మంది చిన్నారులలో దాగి ఉన్న సృజనాత్మకతను సైతం దీని ద్వారా వెలుగులోకి తీసుకురావాలన్నది అధికారుల యోచన. ఇప్పటికే విభిన్న కార్యక్రమాల ద్వారా ప్రత్యక్షంగా పర్యావరణ ఉత్పత్తులను రూపొందిస్తూ బల్దియాకు వెస్ట్ జోన్ అధికారులు ఆదర్శంగా నిలుస్తుండగా... ప్రజలను, చిన్నారులను భాగస్వాములను చేయటం ద్వారా మరింతగా విస్తృతం చేసి పర్యావరణ సైనికులను పెంచుకోవాలని భావిస్తున్నారు. ప్లాస్టిక్ టైల్స్, ఆహార వ్యర్థాల ద్వారా గ్యాస్ ఉత్పత్తి, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌తో చెత్త బుట్టల తయారీ సహా ఇతర ప్రయత్నాలతో వెస్ట్ జోన్ అధికారులు బల్దియాలో తమదైన ముద్ర వేయగా...ప్రజా భాగస్వామ్యంతో మరిన్ని విజయాలను నమోదు చేయాలని వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...