మెట్రో స్టేషన్లలో వైజ్ఞానిక ప్రదర్శనలు


Fri,October 11, 2019 03:33 AM

-ఐఐసీటీ సహకారంతో ఎగ్జిబిషన్లు
-సైన్స్ కారిడార్‌పై ప్రత్యేక దృష్టి
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మెట్రోరైలు ప్రజా రవాణా వ్యవస్థగానే కాకుండా సామాజిక చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నది. ఇప్పటికే మెట్రోరైలు స్టేషన్లలో ప్రయాణేతర కార్యక్రమాలను కొనసాగిస్తున్నది. సామాజిక బాధ్యతగా ఐఐసీటీతో కలిసి సంయుక్తంగా ప్రాజెక్టును సైన్స్‌కు అనుగుణంగా మరల్చడానికి సిద్ధమయ్యారు. ప్రతి స్టేషన్లో రసాయన, భౌతిక శాస్ర్తానికి సంబంధించిన ఫార్ములాలు, పరిశోధనలకు సంబంధించిన నమూనాలు, సమాచారంతో కూడిన ప్రదర్శనలను మెట్రో కారిడార్లలోని స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. కొద్ది రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఐఐసీటీ భాగస్వామ్యంతో నిర్వహించనున్న ఎగ్జిబిషన్స్‌లో శాస్త్రవేత్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా కీలక భాగస్వాములుగా ఉంటారు. ప్రజా జీవితాల్లోకి సైన్స్‌ను మరింత విస్తృతం చేయడానికి వీటిని ఉపయోగించనున్నారు. మెట్రోరైలు కారిడార్లలో ప్రతిరోజు 3 లక్షల మంది ప్రయాణిస్తుండటంతో ప్రయాణికులకు శాస్త్ర విజ్ఞానంపై అవగాహన పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఐఐసీటీ డైరెక్టర్ చంద్రశేఖర్‌తో మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చర్చించారు. దీంతోపాటు చంద్రయాన్-2 పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో చంద్రయాన్-2కు ఒక స్టేషన్‌ను అంకితమివ్వడానికి నిర్ణయించారు. అదేవిధంగా శాస్త్రవేత్తలకు కూడా మెట్రో కారిడార్లలో పెద్దపీట వేయడానికి కారిడార్3లోని తార్నాక నుంచి నాగోల్ కారిడార్‌ను సైన్స్ కారిడార్‌గా ప్రకటించారు. అందులోభాగంగా 150 పిల్లర్లపై యువకులపై ప్రభావం చూపిన ప్రముఖులైన శాస్త్రవేత్తల చిత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ మెట్రో డాక్టర్ శ్రీధరన్, డాక్టర్ వీకే సారస్వత్, క్యాన్సర్ స్పెషలిస్ట్ దత్తాత్రేయుడు నూరి, శామ్ పిట్రోడా, ఎంఎస్, స్వామినాథన్ వంటి ప్రముఖుల చిత్రాలుంటాయి.

సామాజిక అవగాహన కోసం..
సమాజంలో అవగాహన పెంపొందించడం కోసం స్టేషన్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. మూఢ నమ్మకాలను అరికట్టాలనే ధ్యేయంతో చేతబడి, నకిలీబాబాలు చేసే మోసాలు, రైస్ ఫుల్లింగ్ వంటి మోసాలు, వినియోగదారులకు జరుగుతున్న మోసాలు, చట్టాలపై అవగాహన, మహిళలపై జరుగుతున్న అరాచకాలు, సోషల్ మీడియా చీటింగ్, తదితర అంశాలతోపాటు మూఢ నమ్మకాల పేరుతో జరిగే నష్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించి సామాజికాభివృద్ధిలో హైదరాబాద్ మెట్రోరైలు కీలకంగా వ్యవహరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles