సఫాయి కర్మచారిల సంక్షేమానికి ప్రణాళికలు


Thu,October 10, 2019 02:40 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్ పరిధిలో గతంలో మ్యాన్యువల్ స్కావెంజింగ్ వృత్తిలో కొనసాగినవారి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. 2003లో ఈ వృత్తిపై నిషేధం విధించడంతో అప్పటి నుంచి ఈ వృత్తి కనుమరుగైపోయింది. అయితే, గతంలో ఈ వృత్తిని నమ్ముకొని జీవించినవారి వివరాలు సేకరించాలని జీహెచ్‌ఎంసీ సంకల్పించింది. ఇందులో భాగంగా బుధవారం కమిషనర్ లోకేశ్‌కుమార్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సఫాయి కర్మచారి సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సఫాయి కర్మచారి వర్గానికి చెందినవారికి ఏ విధమైన సమస్య ఎదురైనా నిబంధనల ప్రకారం వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు తమవద్ద 140 మంది సఫాయి కర్మచారిల వివరాలు అందుబాటులో ఉన్నట్లు, ఇంకా ఎవరైనా గతంలో ఈ వృత్తిలో కొనసాగి ఉంటే వారి వివరాలను అందజేయాలని సంఘాల ప్రతినిధులను కోరారు.

నగరంలో బీఓటీ పద్ధతిలో ఏర్పాటు చేసిన టాయిలెట్ల నిర్వహణ బాధ్యతను సఫాయి కర్మచారి సంఘాలకు అందించాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పారిశుధ్యానికి సంబంధించిన వివిధ రకాల ఇంజినీరింగ్ పనుల కాంట్రాక్టులు మేదరి సామాజికవర్గానికి లభించేవిధంగా టెండరు నిబంధనల్లో మార్పులు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనున్నట్లు చెప్పారు. పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి చొప్పున తప్పనిసరిగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. 2015 నుంచి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీలో 223 కారుణ్య నియామకాలు జరుగగా, అందులో 33 మంది సఫాయి కర్మచారి వర్గానికి చెందినవారు ఉన్నట్లు కమిషనర్ వివరించారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...