ఫ్యాన్సీ నంబర్ పట్టేద్దాం..


Fri,September 20, 2019 01:51 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వాహన ఫ్యాన్సీ నంబర్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో వీటిని ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా కేటాయించాలని నిర్ణయించారు. నగరంలో వీటికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో అధికారులకు నంబర్ల కేటాయింపు తలకు మించిన భారంగా మారుతున్నది. రవాణాశాఖలో ఇప్పటికే చాలా సేవలు ఆన్‌లైన్ ద్వారా అందించినప్పటికీ అప్పట్లో కేవలం ఫ్యాన్సీ నంబర్లను ఆన్‌లైన్ సేవల నుంచి మినహాయించారు. దీంతో నంబర్లు కావాలనుకునే వాహన యజమానులు తప్పనిసరిగా రవాణాశాఖ ప్రాంతీయ కార్యాలయాలకు వచ్చి బిడ్డింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. నంబరు అవసరమున్న వారెవరైనా తాము బిడ్ చేయాలనుకున్న మొత్తాన్ని రవాణాశాఖ పేరుతో తీసిన బ్యాంకు డిమాండ్ డ్రాఫ్ట్‌లను సీల్డ్ కవర్‌లో ఉంచి బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది. వీటిని నంబరు కోసం పోటీపడే వ్యక్తుల సమక్షంలో తెరుస్తారు. సీల్డు కవర్‌లో ఉన్న డిమాండ్ డ్రాఫ్ట్‌లను తెరువగా ఎవరు ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారో బయటపడుతుంది. దీనిద్వారా ఎక్కువ మొత్తం చెల్లించడానికి సిద్ధమైన వ్యక్తికి లేదా సంస్థకు నంబరు కేటాయిస్తారు. ఈ విధానం వల్ల అధికారులపై తరుచూ విమర్శలు వస్తున్నాయి.

రవాణాశాఖ అధికారులు, సిబ్బంది దీనివల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికితోడు కొంతమంది పలుకుబడి గల వ్యక్తులు నంబరు కోసం ఒత్తిడి తెస్తున్నారు. అధికారులు ఎంత నిజాయితీగా వ్యవహరించినా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. దీంతో కొత్తగా తెచ్చే ఆన్‌లైన్ విధానం వల్ల రవాణాశాఖకు ఆదాయం కూడా పెరిగే అవకాశముంది. ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో పాల్గొనే వ్యక్తులకు పోటీపడే వ్యక్తులు ఎంతకు వేలంపాట పాడుతున్నారో అర్థం అవుతుంది. కావాలనుకున్నవారు నంబరు కోసం వేలంలో పాల్గొని అధిక మొత్తం చెల్లించేందుకు సిద్ధమయ్యే అవకాశముంది. దీంతో రవాణాశాఖ రాబడి పెరుగుతున్నదని భావించారు. ప్రస్తుతం సీల్డ్‌కవర్ బిడ్డింగ్ పద్ధతిలో ఎవరు ఎక్కువ బిడ్ ఎమౌంట్ వేస్తే వారికే ఇస్తున్నారు. ఇది కొంతవరకు ఇటు రవాణాశాఖకు అటు వినియోగదారులకు నష్టమేననే అభిప్రాయమున్నది. ఈ విషయాన్ని ఇటీవల రవాణాశాఖ మంత్రి కూడా ప్రకటించారు. గ్రేటర్ పరిధిలో ఫ్యాన్సీ నంబర్లకు ఎక్కువ క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఆన్‌లైన్ సేవలతో ప్రయోజనం కలుగనున్నది.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...