మరణమే శరణ్యమనుకుంటున్నారు!


Wed,September 18, 2019 02:50 AM

గొట్టిముక్కుల సుధాకర్ గౌడ్ ( సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ) :చిన్న సమస్యలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉన్నత విద్యనభ్యసించి.. మంచి ఉద్యోగాలు చేస్తున్నా.. సమస్యలను ఎదుర్కోలేకపోతున్నారు. ఒత్తిడిలో ఉన్నవారంతా మరణమే శరణ్యం అనుకుంటే పరిస్థితి ఎలా, బతకాడానికి ధైర్యం చేయలేక చావడానికి మాత్రం ఎక్కడలేని ధైర్యం చేస్తున్నారు. ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో ఆరుగురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మంచి కౌన్సెలింగ్ ఇచ్చినా... ప్రత్యేక మెడిటేషన్ తరగతులు నిర్వహిస్తున్నా ఫలితం లేకుండా చిన్న విషయానికి ఓటమిని అంగీకరిస్తూ ప్రాణాలు తీసుకున్నారు. వేళాపాలా లేని ఉద్యోగాలు, ఒత్తిడితోనే వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైద్య నిపుణులు పేర్కొంటారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలపై పోలీసుల విచారణలో తేలిన అంశం.. వాటి వివరాలను ఇలా ఉన్నాయి.

స్నేహితుడు వెళ్లగానే.. ఫ్యాన్‌కు ఉరి
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది జనవరి 3న ఈ ఘటన చోటు చేసుకున్నది. కేరళకు చెందిన ఎబిన్ డేవిస్ సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 2న రాత్రి 12 గంటలకు ఉద్యోగం ముగించుకుని వచ్చాడు. ఆ రూమ్‌లో ఉంటున్న అతడి స్నేహితుడు సాయంత్రం 5 గంటలకు వచ్చి చూసే సరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విచారణలో పలు వ్యక్తిగత కారణాలతో సూసైడ్ చేసుకున్నాడని తేలింది.

పాలిథిన్ కవర్.. గమ్ టేప్ అంటించుకొని
మాదాపూర్ నెస్ట్ హాస్టల్‌లో ఉంటున్న శ్రీ విద్యాజగదీశ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నది. ఆమె ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మొఖానికి పాలిథిన్ కవర్ చుట్టుకొని, ఊపిరి ఆడకుండా గమ్ పేస్టుతో కవర్‌ను అంటించుకున్నది. అలా ప్రాణాలు విడిచింది. దర్యాప్తులో మానసిక ఒత్తిడి కారణమని పోలీసులు తేల్చారు.

ప్రార్థన చేసి వస్తానని...
సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన నవీన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఏప్రిల్ 29న ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చాడు. తల్లి భోజనం చేయమంటే ప్రార్థన చేసుకొని వచ్చి తింటానని చెప్పి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. పోలీసుల విచారణలో ఆత్మహత్యకు సరైన కారణం తెలియరాలేదు.

జీవితంపై విరక్తి చెంది..
మాదాపూర్ ప్రాంతానికి చెందిన సురేశ్‌రెడ్డి వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. విద్యార్హతకు తగట్టు ఉద్యోగం, భారీ జీతం ఉన్న ఆయనకు జీవితంపై విరక్తి పెరిగింది. దీంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉన్నత హోదా కోసం ప్రయత్నం.. అంతలోనే ఆత్మహత్య
రంజిత్ పటేల్ ఏటీఎస్‌టీ కంపెనీలో సీనియర్ మేనేజర్. ఇంకా పెద్ద హోదా కోసం ప్రయత్నంలో ఉన్నాడు. ఓ రోజు భార్యకు ఫోన్ చేసి తన ప్రొఫైల్‌ను సరిచూడాలని కోరాడు. కొద్ది గంటల్లో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆ కుటుంబాన్ని షాక్‌కు గురి చేసింది.

షేర్ మార్కెట్‌లో నష్టం..
నార్సింగి ప్రాంతానికి చెందిన శ్రీనాథ్‌రావు వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. డబ్బు బాగా సంపాదించాలని షేర్ మార్కెట్‌లో 20 లక్షలు పెట్టుబడి పెట్టాడు. దాంట్లో 18 లక్షలు నష్టానికి గురై 2 లక్షలు మిగిలాయి. దీంతో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు. ఈ నష్టంతోనే తన జీవితం ముగిసిపోయిందనుకుని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...