ఆచూకీ తెలియక ఆందోళన


Tue,September 17, 2019 02:28 AM

-ఇంకా లభించని కచులూరు పడవ ప్రమాదంలో గల్లంతైన వారి వివరాలు
-కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు
-బోడుప్పల్‌కు చేరుకున్న జ్యోతి మృతదేహం

కుటుంబ సభ్యులను ఓదార్చి.. రాజమండ్రికి పయనం
మన్సూరాబాద్, సెప్టెంబర్ 16 : తూర్పుగోదావరి జిల్లా, దేవిపట్నం మండలం కచులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన హయత్‌నగర్ డివిజన్‌కు చెందిన విశాల్, భరణికుమార్ కుటుంబసభ్యులు, ప్రమాదం నుంచి బయటపడిన అర్జున్, ధరణి కుటుంబసభ్యులను సోమవారం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శితో మాట్లాడం జరిగిందని.. గల్లంతైన వారి ఆచూకీని త్వరితగతిన తెలుసుకోవాలని కోరానని తెలిపారు. అనంతరం హయత్‌నగర్ నుంచి బాధిత కుటుంబసభ్యులతో కలిసి ఎమ్మెల్యే రాజమండ్రికి బయలుదేరారు.

రెండు రోజులైనా తెలియని సాయికుమార్ ఆచూకీ
గోదావరి బోటు ప్రమాదంలో మాదాపూర్‌కు చెందిన ఈరన్.సాయికుమార్ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. ప్రమాదం గురించి తెలుసుకున్న మరుక్షణమే కుటుంబ సభ్యులు సాయికుమార్‌కు ఫోన్ చేయడంతో ఫోన్ స్విఛాఫ్ అని వచ్చింది. దీంతో కంగారుతో సాయికుమార్ కుటుంబానికి చెందిన బంధువులు 10 మంది కలిసి ప్రమాదం జరిగిన స్థలానికి ప్రయాణమయ్యారు. మాదాపూర్‌లోని సాయికుమార్ ఇంటికి స్థానికులు, బంధువులు చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.

కుటుంబంలో ఇద్దరే మిగిలారు..
-కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
-పరామర్శించిన ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కాలనీ వాసులు
గోదావరి పాపికొండల విహార యాత్రకు వెళ్లి బోటు ప్రమాదంలో గల్లంతైన వారి వివరాలు తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. రామంతాపూర్ ఆర్‌టీసీ కాలనీకి చెందిన అంకెల పవన్, భార్య వసుంధర, వీరి కుమారుడు సుశీల్ ఆచూకీ ఇంత వరకు తెలియక పోవడంతో అతని తండ్రి శంకర్, తల్లి రేవతిలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదిలా ఉండగా రామంతాపూర్ నుంచి పలువురు బంధువులు, స్నేహితులు బోటు ప్రమాద సంఘటనా స్థలానికి వెళ్లి సమాచారం సేకరిస్తున్నారు.

పరామర్శించిన ఎమ్మెల్యే బేతి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్
బోటు ప్రమాదంలో గల్లంతైన ఆర్‌టీసీ కాలనీకి చెందిన శంకర్ కుటుంబ సభ్యులను సోమవారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, స్థానిక సంక్షేమ సంఘం అధ్యక్షులు పసుల ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నాయకుడు కక్కిరేని హరీశ్‌లు పరామర్శించారు.

ఇద్దరినే మిగిల్చిన విషాదం
బోటు ప్రమాదంలో శివజ్యోతి మృతి చెందగా, కుమారుడు పవన్, మనవడు సుశీల్, కోడలు వసుంధరలు గల్లంతయ్యారని, అల్లుడు గాయాలతో భయటపడ్డాడని, దీంతో కుటుంబంలో ఇద్దరే మిగిలారని వృద్ధ దంపతులు విలపిస్తుండడంతో అందరిని కలిచివేసింది.

క్షేమంగా బయటపడిన చంపాపేట యువకుడు రాజేశ్
చంపాపేట : గోదావరిలో పాపికొండల విహార యాత్ర బోటు బోల్తా ప్రమాదం నుంచి చంపాపేట ఎస్‌బీఐ కాలనీకి చెందిన సోలేటి రాజేశ్(24)క్షేమంగా బయటపడ్డాడు. సోమవారం ఉదయం రాజేశ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను క్షేమంగా ఉన్నానని తెలిపడంతో రాజేశ్ తల్లిదండ్రులు శివకుమార్, మంజుల ఊపిరి పీల్చుకున్నారు. చంపాపేట ఎస్‌బీఐ కాలనీలో వారు మాట్లాడుతూ తమ కుమారుడు రాజేశ్ పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్‌లో ఏఈగా (అవుట్ సోర్సింగ్ ఉద్యోగి) పనిచేస్తున్నాడని తెలిపారు. అయితే రాజేశ్‌తో పాటు వెళ్ళిన సురేశ్, శివశంకర్, కిరణ్‌లు ప్రమాదం నుంచి బయట పడగా మరో ముగ్గురు (హేమంత్, తరుణ్, రవీందర్) గల్లంతయ్యారని, వారి ఆచూకీ ఇంతవరకు తెలియలేదని రాజేశ్ ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు రాజేశ్ తల్లిదండ్రులు శివకుమార్, మంజుల పేర్కొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...