ఆటపాటలతో బోధన


Tue,September 17, 2019 02:23 AM

వర్కాల కృష్ణ (అంబర్‌పేట, నమస్తే తెలంగాణ): అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆటపాటల ద్వారా చిన్నారులకు విద్యాబోధన కొనసాగిస్తూ వారిలో చదువుపై ఆసక్తి కలిగిస్తున్నారు. పిల్లవాడు పుట్టుకతోనే నేర్చుకోవడం మొదలుపెడతాడు. పరిశీలన, గ్రహణ, పదజాల వాడుక, తార్కిక ఆలోచన వంటివి పిల్లాడికి ఆరు సంవత్సరాలు వచ్చేలోపే అభివృద్ధి చెందుతాయి. ఇది బడికి వెళ్లకముందు జరిగేది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇండియన్ లిటరసీ ప్రాజెక్టు(ఐఎల్‌పీ) అనే సంస్థ 28 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల విద్యానైపుణ్యం, పోటీతత్వాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నది. ప్రధానంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆట, పాటల ద్వారా చిన్నారులకు విద్యాబోధన కొనసాగిస్తూ వారిలో చదువుపై ఆసక్తి కలిగిస్తున్నది. చిన్నప్పటి నుంచే నీతి కథలు చెబుతూ వారిలో నైతిక విలువలు పెంపొందించే దిశగా బోధన కొనసాగిస్తున్నది. పిల్లలుగా పేర్లతో గుర్తింపు, శరీర భాగాలపై అవగాహన, మంచి అలవాట్లు, ఇతరులతో మాట్లాడే తీరుపై అవగాహన కల్పిస్తూ వారి వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తున్నారు. ఆయా చర్యలను నిత్యం చేపడుతుండటంతో పిల్లల్లో బిడియం తొలగిపోతుంది. మాటలు ఇంకా రాని పిల్లలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వినికిడి శక్తి పెరుగుతున్నది.
ఆటలతో కండరాలు బలపడి పిల్లల్లో ఆరోగ్యం నిర్మాణం పటిష్టంగా జరుగుతున్నది. అంగన్‌వాడీ కేంద్రాల్లో కొనసాగుతున్న ఆయా కార్యక్రమాలు పిల్లల్లో విజ్ఞానం పెంపొందిస్తున్నాయి. నగరంలోని అంబర్‌పేట మండల పరిధిలో 5 అంగన్‌వాడీ కేంద్రాలు, బహదూర్‌పుర మండల పరిధిలో 22 కేంద్రాలు, గోల్కోండ మండల పరిధిలో 10, జిల్లాల్లోకి వస్తే సత్తుపల్లిలో 10 కేంద్రాలలో ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నది. ఇవే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలలో మొత్తం 4800 కేంద్రాలలో ఈ ఐఎల్‌పీ సంస్థ పనిచేస్తూ ఆరు లక్షల మంది పిల్లలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది విజయవంతమైన ఫలితాలను సాధించింది.

ఎస్‌సీసీడీ ద్వారా...
స్కూల్ సెంటర్డ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్(ఎస్‌సీసీడీ) ప్రోగ్రాం ద్వారా జెన్‌పాక్ట్, యునైటెడ్ వే సంస్థల సహాయ సహకారంతో ఐఎల్‌పీ ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ఆయా మండలాల పరిధిలో ఐదు కేంద్రాలకు ఒక న్యూట్రిషియనిస్ట్‌ను, ప్రతి సెంటర్‌కు ఒక టీచర్‌ను ఈ సంస్థ నియమించింది. వీరు 0-3, 3-6 సంవత్సరాల లోపు పిల్లలు, వారి తల్లులు లబ్ధిపొందేలా, ఐసీడీఎస్ లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తున్నది. అంగన్‌వాడీ సెంటర్లకు పెయింటింగ్ వేయించి, బోధగురు రీడింగ్ డివైస్ (ఎన్-జాయ్ లెర్నింగ్ కిట్)ఉపయోగించి పిల్లల నైపుణ్యం పెంచే విద్యను అధునాతన పద్ధతులలో అమలు చేస్తున్నది.

ప్రాజెక్టు ముఖ్య లక్ష్యాలు..
-గర్భిణులు, బాలింతలు, వారి పిల్లలకు పోషకాహార విలువలను తెలిపి ఆరోగ్యం మీద అవగాహన కల్పించడం.
-3 నుంచి 6 సంవత్సరాల పిల్లల భావోద్వేక నైపుణ్యత, కమ్యూనికేషన్ నైపుణ్యతను పెంచి స్కూల్‌కి సంసిద్ధం చేయడం
-ముందుగా పిల్లలలోని వైకల్యాలను గుర్తించడం.
-అంగన్‌వాడీ సెంటర్లలో 3-6 ఏండ్లలోపు పిల్లల నమోదును, హాజరును పెంచడం.
-అంగన్‌వాడీ సెంటర్లలో సమాజ యాజమాన్యాన్ని, తల్లిదండ్రుల భాగస్వామ్యం, క్రియాశీలతను పెంపొందించడం.
-అంగన్‌వాడీ పిల్లలను 1వ తరగతిలోకి వెళ్లే విధంగా మానసికంగా తయారు చేయడం.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...