అన్ని మెట్రో స్టేషన్ల నుంచి బస్సులు!


Mon,July 22, 2019 01:22 AM

-లాస్ట్ అండ్ ఫస్ట్‌మైల్ కనెక్టివిటికీ సన్నాహాలు
-త్వరలో అందుబాటులోకి సేవలు
-మెట్రోతో కనెక్టివిటీకీ ఆర్టీసీ ఓకే
-స్టేషన్ల నుంచి కాలనీలకు సర్వీసులు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మెట్రోరైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు టీఎస్‌ఆర్టీసీ తన వంత పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నది. మెట్రోరైలు ప్రారంభంలో స్టేషన్ల నుంచి ఆర్టీసీ బస్సులు నడిపించింది. గిట్టుబాటు కాలేదని బస్సులను తీసేసిన టీఎస్‌ఆర్టీసీ మళ్లీ మెట్రోస్టేషన్ల నుంచి బస్సులను ఆపరేట్ చేయడానికి సన్నద్ధమైంది. కొద్ది రోజుల కిందట మెట్రోరైలు అధికారుల నుంచి ప్రతిపాదనలు రావడంతో టీఎస్‌ఆర్టీసీ అధికారులు మరోసారి సేవలు అందించేందుకు బస్సులు నడుపనున్నారు. ఈ విషయాన్ని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వినోద్‌కుమార్ ధ్రువీకరించారు. నాగోల్ నుంచి మియాపూర్ వరకు 30 కిలోమీటర్ల మార్గంలో మొదట మెట్రోను ప్రారంభించారు. అదే సమయంలో మెట్రోస్టేషన్లకు అనుసంధానంగా కాలనీల నుంచి బస్సులను ఆపరేట్ చేశారు. ప్రారంభించిన కొద్ది రోజులపాటు మెట్రోకు ప్రయాణికుల సంఖ్య అంతంతే ఉండడంతో ఆర్టీసీ బస్సుల్లో మెట్రోస్టేషన్ల నుంచి ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండేది. దీనివల్ల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు లేక సర్వీసులు రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం మెట్రో రెండు కారిడార్లో 56 కిలోమీటర్ల మేర ప్రయాణికులను చేరవేస్తున్నది. సుమారు 1.85 లక్షల మంది నిత్యం ప్రయాణిస్తున్నారు. దీంతోపాటు వచ్చే నెలలో రాయదుర్గం వరకు మెట్రోసేవలతోపాటు హైటెక్‌సిటీ వద్ద రివర్సల్ సౌకర్యం అందుబాటులోకి రానున్నది. ఇది అందుబాటులోకి వస్తే మెట్రో ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగనున్నది. రాబోయే నవంబర్‌లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రోరైలు ఆపరేషన్లు ప్రారంభం కానున్నాయి. అప్పుడు ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుంది. మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికుల రాకపోకలు ఎక్కువవుతాయి. ఈ పరిస్థితుల్లో లాస్ట్ అండ్ ఫస్ట్‌మైల్ కనెక్టివిటీకీ టీఎస్‌ఆర్టీసీ సేవలు అందించాలని నిర్ణయించింది.

ట్యాక్సీలు, ఆటోలకు గిరాకీ
లాస్ట్ అండ్ ఫస్ట్ మైల్ కనెక్టివిటీని ప్రైవేటు సంస్థలైన ఉబెర్, ఓలా ఉపయోగించుకుంటున్నాయి. స్టేషన్లలో ప్రతినిధులను పెట్టి అవసరమైన ప్రయాణికులకు క్యాబ్ లేదా ఆటోలను అందుబాటులో ఉంచుతున్నారు. ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా వాడుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులు స్టేషన్లలో అందుబాటులో ఉంటే వీటి ద్వారా గమ్యస్థానాలకు చేరేవారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడం వల్ల ప్రైవేటు ట్రాన్స్‌పోర్టును ఆశ్రయిస్తున్నారు. గమనించిన టీఎస్‌ఆర్టీసీ తన సేవలను మెట్రోస్టేషన్ల నుంచి అందించేందుకు అంగీకరించింది.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...