కొత్తగా 47.. హరితహారం పార్కులు


Sun,July 21, 2019 12:26 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హరితహారం కార్యక్రమంలో భాగంగా సుమారు ఒక ఎకరం విస్తీర్ణంగల 47 జీహెచ్‌ఎంసీ ఖాళీ జాగాల్లో ప్రత్యేకంగా పార్కులను అభివృద్ధి చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. వివిధ రకాల థీమ్‌లతో ఏర్పాటుచేసే ఈ పార్కులను హరితహారం పార్కులుగా పిలువనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ల్యాండ్‌స్కేపింగ్‌కు సంబంధించిన నమూనాలు తయారవుతున్నట్లు వారు పేర్కొన్నారు.
హరితహారంలో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిథిలో 3084 ఖాళీ స్థలాల (1727ఎకకాల విస్తీర్ణం)ను బల్దియా అధికారులు ఎంపికచేశారు. వీటితోపాటు 873పార్కుల్లో అందుబాటులో ఉన్న 696ఎకరాల ఖాళీ స్థలాల్లోనూ మొక్కలు నాటాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. వీటితోపాటు గ్రేటర్‌లోని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాల ఖాళీస్థలాల్లో ప్లాంటేషన్ చేపట్టనున్నారు. అలాగే చెరువుల గట్టు, వాకింగ్ ట్రాక్‌లకు ఇరువైపులా, శ్మశానవాటికలు తదితరచోట్ల కూడా ఖాళీస్థలాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు.సీఎం ఆదేశాలమేరకు రూ. 17.75కోట్ల వ్యయంతో సూరారం, మాదన్నగూడ, నాదర్‌గుల్ బ్లాక్‌లలో అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధిచేస్తున్నారు. అలాగే మొక్కల సంరక్షణలో కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలు తదితరవాటిని పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని జీహెచ్‌ఎంసీ సంకల్పించింది. ఇందుకుగాను కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద ట్రీగార్డ్‌లను అందజేయాలని జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తిచేస్తుంది. ట్రీగార్డ్‌ల తయారీ, వాటి ధర, లభ్యత వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టారు. గ్రేటర్ పరిధిలో ఈ ఏడాది హరితహారం కార్యక్రమంలో భాగంగా మూడు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే కోటి మొక్కలు జీహెచ్‌ఎంసీ వద్ద సిద్ధంగా ఉన్నట్లు, కోటిన్నర మొక్కలు జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డులకు చెందిన ఖాళీ జాగాల్లో ఏర్పాటుచేసిన నర్సరీల్లో పెంచుతున్నారు. మరో 70 లక్షల మొక్కల మొక్కలను పెంచడానికి హెచ్‌ఎండీఏ, హౌసింగ్‌బోర్డులకు చెందిన ఖాళీజాగాలను ఎంపిక చేశారు. ఈసారి జీహెచ్‌ఎంసీ పెంచుతున్న మొక్కల్లో వేప, జువ్వి, కానుగ, జమ్మి తదితర రకాలతోపాటు సపోట,మామిడి, అల్లనేరేడు, బాదం మున్నగు పండ్లమొక్కలున్నాయి. వీటితోపాటు వివిధ ఔషధ మొక్కలను ఇళ్లకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. అలాగే, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జోనల్, సర్కిల్ స్థాయిలో అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంఘాలతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేయాలని కమిషనర్ నిర్ణయించారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...