చెన్నై కంటే.. మనం చాలా బెటర్


Fri,July 19, 2019 02:59 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నీటి వనరులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జలమండలి ఎండీ దానకిశోర్ పిలుపునిచ్చారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని జలమండలి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కులో ఏర్పాటు చేసిన బ్యాంకు ఆఫ్ అమెరికా నుంచి వచ్చిన వలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో ఎండీ పాల్గొని మాట్లాడారు. చెన్నైలో సగటున ఒక మనిషికి 65 లీటర్ల చొప్పున రోజుకు కేవలం 50.5 కోట్ల లీటర్లు సరఫరా చేస్తే.. హైదరాబాద్‌లో ఒక మనిషికి 150 లీటర్ల చొప్పున రోజుకు 203.6కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నామని ఎండీ వివరించారు. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో మంచినీటి సరఫరా బాగున్న వాటిలో హైదరాబాద్ ప్రధానమైనదని చెప్పారు. ప్రజలకు అవగాహన లేకనే నీటి వృథా చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నీటి ఇబ్బందులు వస్తాయని ప్రజల్లో అవగాహన లేదన్నారు. నగరంలో ఇష్టానుసారంగా బోర్లు వేయడం వల్లే నీటి ఎద్దడి ఏర్పడిందని ఎండీ అభిప్రాయపడ్డారు. ప్రజల్లో మార్పు వస్తేనే ఏదైనా సాధ్యమన్నారు. అందుకే జలం పొదుపుపై జనులను నడిపించేందుకు జల నాయకులు కావాలన్నారు. అధికారులతోపాటు ప్రజలు కూడా అవగాహన కల్పించాలని, అందుకే వాక్ కార్యక్రమం మొదలు పెట్టినట్లు చెప్పారు. నగరంలోని 150 వార్డుల్లో ఒక్కో వార్డు నుంచి 2500 ఇండ్లను ఎంపిక చేసుకుని నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని ఎండీ అన్నారు. అంతేకాకుండా చెరువులు, కుంటలు అని తేడా లేకుండా నీటి వనరులు ఆక్రమించి భవనాలు నిర్మించడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. వలంటీర్లు ప్రతి వారం ఒక గంట సేపు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. మన నగరాన్ని అభివృద్ధి చేసుకుంటూనే సహజ సిద్ద నీటి వనరులు కాపాడుకోవాలని సూచించారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...