నాలుగు మండలాల్లో..తోడేస్తున్నారు


Fri,July 19, 2019 02:54 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌లో సగటున ఒక మనిషి రోజుకు 150 లీటర్ల నీళ్లను వాడుతున్నారు. ఇలాగే నీటి వినియోగం రోజు రోజుకు పెరిగిపోతే కష్టాలు తప్పవు. ప్రకృతి ప్రసాదించిన నీటి వనరులను జాగ్రత్తగా కాపాడుకుంటేనే భావితరాలకు బంగారు భవిష్యత్‌ను ప్రసాదించగలం. రోజు రోజుకు తరిగిపోతున్న భూగర్భ జలాలను పునరుద్ధరించడం, ఇంటింటికి స్థిరంగా మంచినీటి సరఫరా, నీటి వనరుల పరిరక్షణ, భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జల్‌శక్తి అభియాన్‌ను ప్రారంభించింది. హైదరాబాద్ జిల్లా సైతం ఈ అభియాన్ కింద ఎంపిక కాగా, నీటి వనరుల సంరక్షణ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయబోతున్నారు. దీనిలో భాగంగా 2016-17 సంవత్సరానికి గాను భూగర్భ జల నీటి మట్టాన్ని ప్రామాణికంగా తీసుకుని అందుబాటులో ఉన్న జల వనరుల్లో 100 శాతం కంటే అధికంగా నీటిని వాడుతున్న జిల్లాలను ఎంచుకుని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా, హైదరాబాద్ సైతం ఇదే జాబితాలో ఉండటం గమనార్హం.

నాలుగు మండలాల్లో తోడేస్తున్నారు..
భూగర్భ జల వనరులశాఖ ద్వారా జిల్లాలోని 22 ప్రాంతాల్లో ప్రతి నెలా భూగర్భ నీటి మట్టాన్ని పరీక్షిస్తున్నారు. అయితే జిల్లాలోని 4 మండలాల్లో భూగర్భజలాల వినియోగం అత్యధికంగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అమీర్‌పేట, తిరుమలగిరి, ఖైరతాబాద్, మారేడ్‌పల్లి మండలాల్లో నీటి వినియోగం అత్యధికంగా ఉన్నది. వీటితోపాటు మిగతా మండలాల్లోనూ జల్‌శక్తి అభియాన్‌ను పకడ్బందీగా అమలు చేయబోతున్నారు. జిల్లాలో జల్‌శక్తి అభియాన్ కార్యక్రమ అమలుకు కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి పద్మలోచన్ సాహును నోడల్ ఆఫీసర్‌గా, రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిగా ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్‌ను నియమించారు. క్షేత్రస్థాయి కార్యక్రమాల కోసం జిల్లాలో మొత్తం 16 మండలాలు ఉండగా, నలుగురు సభ్యులతో కూడిన 4 బృందాలను నియమించారు. ఈ బృందాలకు బ్లాక్ నోడల్ అధికారి నేతృత్వం వహించనుండగా, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, జలమండలి సహా ఇతర శాఖల అధికారులు భాగస్వామ్యం కానున్నారు. బ్లాక్(మండల) స్థాయిలో నీటి సంరక్షణ, వర్షపు నీటి సద్వినియోగం, చెరువుల పునరుద్ధరణ, ఇంజక్షన్ బోర్‌వెల్స్, ఇంకుడు గుంతల నిర్మాణం తదితర కార్యక్రమాలను చేపట్టబోతున్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...