యాత్రికుల కోసం కొత్త బస్సులు


Thu,July 18, 2019 03:30 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తిరుపతికి వెళ్లే యాత్రికుల కోసం పర్యాటక శాఖ సరికొత్త బస్సులు అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇప్పటివరకు షిర్డీకీ మాత్రమే రెండు సర్వీసులు నడిపిస్తున్న పర్యాటకశాఖ మరో 14 బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై పర్యాటక శాఖ ఉన్నతాధికారులు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. హైదరాబాద్ నుంచి షిర్డీతోపాటు తిరుపతికి యాత్రికులు, పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రయాణికులను ఆకర్షించేందుకు పర్యాటక శాఖ సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే షిర్డీతోపాటు తిరుపతి యాత్ర కోసం తెలంగాణ పర్యాటకశాఖ సేవలు ప్రజల మన్ననలు పొం దుతున్న నేపథ్యంలో మరింత మందిని ఆకర్షించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ పర్యాటక సంస్థ ద్వారా తీర్థయాత్రలకు వెళ్తే దర్శనంతోపాటు ప్రయాణం కూడా సుఖవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థను ఆశ్రయిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు పర్యాటకశాఖ నిర్ణయించింది. కొత్తగా పీచర్లతో స్కానియా, ఓల్వో, భారత్‌బెంజ్ వంటి బస్సుల్లో ఏదో ఒక కంపెనీని ఎంపిక చేసుకుని కొనుగోలు చేయనున్నారు.

విమానంలో ప్రయాణించిన అనుభూతి
మల్టీ యాక్సెల్ బస్సులో ప్రయాణిస్తే దాదాపు విమానంలో ప్రయాణించిన అనుభూతి స్వంతం అవుతుంది. రోడ్డుపై గుంతలు ఉన్నా ప్రయాణంలో ఇబ్బంది లేకుండా సాగడమే దాని ప్రత్యేకత. మామూలు బస్సుల్లో ప్రయాణిస్తే ఇటువంటి అనుభూతి ఉం డదు. వీల్‌బేస్ వ్యాసార్థ్ధం ఎక్కువగా ఉండటం వల్ల అతి తక్కువ వ్యవధిలో వేగాన్ని పుంజుకునే సదుపాయంతోపాటు కుదుపులు లేని ప్రయాణం స్వంతం అవుతుంది. ఎలక్ట్రానికల్లీ కంట్రోల్‌డ్ ఏయిర్ సస్పెన్షన్స్(ఈసీఎస్)తోపాటు ఏసీ సౌకర్యం, ఆటోమేటిక్ గేర్ సిస్టం, పది టైర్లతో కూడిన ఈ బస్సు గంటకు సుమారు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉంది. యాత్రికులను గమ్యస్థానాలకు త్వరితగతిన చేరడంతోపాటు పర్యాటకులను ఆకర్షించేదుకు వీలైనంత త్వరగా వీటిని కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఒక్కో బస్సు రూ.80 లక్షల నుంచి కోటీ రూపాయల ఖరీదు ఉంటుందని పర్యాటకశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...