జలం కోసం ప్రణాళికలు


Tue,July 16, 2019 04:02 AM

రంగారెడ్డి జిల్లా,నమస్తే తెలంగాణ: జలశక్తి అభియాన్‌లో చేపట్టాల్సిన పనులను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రణాళికలను సిద్ధం చేశారు. జిల్లాలోని 18 మం డలాల్లో ఇంకుడుగుంతలు, సామూహిక ఇంకుడుగుంత లు, సేద్యం నీటిగుంతలు, ఉపరితల నీటి గుంతలు, పొలాల మధ్య వాలు కట్టలు, చెరువుల్లో పూడికతీత, కొండలపై నుంచి వాలుకు అడ్డంగా గుంతలు, గుట్టల చుట్టూ గుంతలు, బోరుబావుల రీచా ర్జ్ వంటి పనులకు మండలాలవారీగా అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. 560 పంచాయతీల పరిధిలో ఈ పనులు చేపట్టానున్నారు. పనులకు సంబంధించి పర్యవేక్షణ, కార్యక్రమ అమలు, విధివిధానాలు వివరించేందుకు కేంద్ర బృందం నాలుగు రోజులుగా జిల్లాలో పర్యటించింది. నీటి సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలను వివరించి, ఆమనగల్లు, తలకొండపల్లి, కొత్తూరు మండలాల్లో పర్యటించి నీటి నిల్వలపై అవగాహన, నీటిని ఒడిసిపట్టే మహా ఉద్యమంపై ప్రజలకు చైతన్యం కల్పించారు.

జలవనరుల గుర్తింపు ఇలా...
ప్రత్యేక అధికారులు మూడు నెలలకు ఒక్కసారి ఈ పనులను పర్యవేక్షణ చేయనున్నారు. సాంకేతిక నిపుణులతో సమావేశాలు, ప్రణాళిక రూపొందిస్తారు. రైతులు ఏవిధంగా నీటిని వినియోగిస్తున్నారో పరిశీలిస్తారు. పొదుపు చేసిన నీటిని ఎలా ఆదాచేయాలో అవగాహన కార్యక్రమాలు వ్యర్థ నీరు ఎలా వినియోగిస్తున్నారో పరిశీలించి దాన్ని శుద్ధి చేసి పునర్వినియోగం ఎలా చేయాలో ప్రయోగాత్మకంగా చేసి చూపుతారు. ఆయా యూనివర్సిటీలకు చెందిన నిపుణుల సలహాలతో ముమ్మరంగా జల సంరక్షణ చర్యలు చేపడతారు. అనంతరం కార్యక్రమాలపై నివేదిక రూపొదించి కేంద్ర జలశక్తి అభియాన్ మంత్రిత్వ శాఖకు అందజేస్తారు.

ప్రణాళికలు ఇవే...
జిల్లాలోని 560 గ్రామ పంచాయతీల్లో 14వేల ఇంకుడు గుంతలు, 2800 సామూహిక ఇంకుడు గుంతలు, 5600 సేద్యపు నీటి గుంతలు, 2800 ఉపరితల నీటి గుంతలు, 1120 పొలాల మధ్య వాలు కట్టలు, 1120 చెరువుల్లో పూడికతీత, 2800 కొండలపై నుంచి వాలుకు అడ్డంగా గుంతలు,1120 గుట్టల చుట్టూ గుంతలు, 5600 బోరుబావుల రీచార్జ్ చొప్పున పనులు గుర్తించారు. అలాగే ప్రధాన మంత్రి కృషి సించయ్ యోజన పథకంలో భాగంగా మైక్రో వాటర్ షెడ్ పనులను ప్రారంభించానున్నారు. జిల్లాలోని ఏడు మండలాల్లో 53 ప్రాంతాల్లో 265 మైక్రో వాటర్ పను లు,159 ప్రాంతాల్లో చెక్ డ్యాం వాల్స్, 159 ఉటకుంటలు,106 చిన్న ఉటకుంటలు, 795 రాళ్ల కట్టలు చొప్పున మొత్తం 1484 పనులు జరగనున్నాయి.

పీడీతో భేటీ..
నాలుగు రోజులు జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం సభ్యులు సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ఛాంబర్‌లో పీడీ ప్రశాంత్‌కుమార్‌తో ముచ్చటించారు. గత నాలుగు రోజులు జిల్లాలో పర్యటించి గుర్తించిన సమస్యలను, నీటి నిల్వలపై గుర్తించిన ప్రాంతాలపై ముచ్చటించారు. సోమవారం వారు తిరిగి వెళ్లారు. మళ్లీ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జిల్లాలో పర్యటన చేయనున్నారు. గుర్తించిన పనులను సెప్టెంబర్‌లోపు పూర్తి చేయాల్సి ఉంది.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...