శుద్ధి చేసి.. తీర్చిదిద్ది..


Sat,July 13, 2019 01:29 AM

కొండాపూర్: అపరిశుభ్రంగా మారిన కుంటలను, చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వానికి తోడుగా మేమున్నామంటూ స్వచ్ఛందంగా ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి సర్కిల్ -20 పరిధిలోని కొండాపూర్ డివిజన్ కొండాపూర్‌లోని రంగన్నకుంటను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీతో కలిసి యూనైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, మైలాన్ సంస్థ ఉద్యోగులు ముందుకొచ్చారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ సిబ్బందితో కలిసి మైలాన్ సంస్థ ఉద్యోగులు 100 మందికి పైగా పాల్గొని రంగన్న కుంటలోని చెత్తాచెదారంతో పాటు గడ్డిని తొలగించారు. అదే విధంగా కుంట చుట్టూ మొక్కలు నాటేందుకు సీడ్ బాల్స్‌ని తయారీ చేసి నాటారు. రంగన్న కుంటను పూర్తి స్థాయిలో అందంగా తీర్చిదిద్దేందుకు యూనైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్‌తో కలిసి మైలాన్ ఉద్యోగులు సిద్ధ్దంగా ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

చెరువులు, కుంటల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
నగరంలోని వివిధ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలను జీహెచ్‌ఎంసీ, వివిధ సంస్థలతో కలిసి అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. చెరువుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా ప్రైవేట్ సంస్థలు ముందుకు రావడం సంతోషంగా ఉంది. నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లోని చెరువుల ఆక్రమణలను అరికట్టి చెరువుల పునరుద్ధరణ పూర్తి చేస్తేనే భవిష్యత్‌లో నగరంలో నీటి సమస్యను అధిగమించగలం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెరువులతో పాటు మొక్కల పెంపకంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-రేఖా శ్రీనివాసన్, యూనైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సీఈవో

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...