వీఆర్‌వోలకు స్థానచలనం


Sat,July 13, 2019 01:28 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జిల్లా రెవెన్యూలో ఏండ్లుగా పాతుకుపోయి.. ఫోకల్ పోస్ట్‌ల్లో ఊరేగుతున్నవారి పీఠాలు కదిలాయి. కీలక స్థానాల్లో ఉంటూ.. అక్రమాలకు పాల్పడి.. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటూ కొనసాగుతున్న వారికి స్థానాలు మారాయి. జిల్లాలో పాతుకుపోయిన 72 మంది గ్రామ రెవెన్యూ అధికారులను (వీఆర్‌వో) బదిలీచేస్తూ జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్ కన్నన్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో మొత్తం 100 వీఆర్‌వో పోస్టులుండగా, 87 మంది పనిచేస్తుండగా, 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 87 మందిలో 72 మంది చాలా కాలంగా ఒకే చోట పనిచేస్తుండటంతో, వీరందరికి స్థానచలనం కల్పించారు. ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో బదిలీలకు గురవడం రెవెన్యూలో కలకలం రేగింది. ఇంత మందికి స్థాన చలనం కలిగడంతో జిల్లా రెవెన్యూ మొత్తంగా కొత్తముఖాలతో కొలువుదీరనున్నది. జిల్లా రెవెన్యూలోను ప్రక్షాళన చేయడంలో భాగంగా ఉన్నతాధికారులు భారీ ఎత్తునబదిలీలకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల క్రితం పెద్ద మొత్తంలో డిప్యూటీ తాసిల్దార్లు (నయాబ్ తాసిల్దార్), సీనియర్ అసిస్టెంట్లు/ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను బదిలీచేయడగా, తాజాగా గ్రామ రెవెన్యూ అధికారులకు స్థాన చలనం కల్పించారు. దీంతో రెవెన్యూశాఖ భారీ కుదుపునకు గురయ్యింది. వీఆర్‌వోల బదిలీల్లో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కౌన్సిలింగ్‌ను నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) ఎంవీ భూపాల్‌రెడ్డిల స్వీయ పర్యవేక్షణలో కౌన్సిలింగ్‌ను నిర్వహించి, రెండేండ్లు అంతకంటే అధికంగా పనిచేసిన వారందరి బదిలీచేశారు. సీనియార్టి ప్రాతిపధికగా ఆప్షన్లు ఇచ్చి, కౌన్సెలింగ్ నిర్వహించి, నచ్చిన చోటును ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. ఇలా మొత్తంగా 72 మందిని బదిలీచేసి రెవెన్యూ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపారు.

ప్రక్షాళన జరిగేనా..
జిల్లా రెవెన్యూను అవినీతి మరకలు పట్టిపీడిస్తున్నాయి. కాసులకు కక్కుర్తి పడుతున్న కొంత మంది సిబ్బంది వ్యవహారం ఆ శాఖకు మాయని మచ్చను తెచ్చింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వర్తింపులోనూ సిబ్బంది అవినీతికి, ఆక్రమణలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో దానికి ఒక్కో రేటు చొప్పున వసూలుచేస్తున్నారన్న ఫిర్యాదులు అందుతున్నాయి. షాదీముబారక్, కల్యాణలక్ష్మీ, డబుల్ బెడ్‌రూం ఇండ్లు, ఆపద్భందు పథకాల అమలులో రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబాకర్ పథకాల అమలులో రూ. 5 వేల నుంచి 7 వేలు లేనిదే ఫైలు ముందుకు కదలడం లేదు. ఇక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, కారణ్య నియమకాల విచారణలు సిబ్బందికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇటీవలీ కాలంలో పలు ఆరోపణల నేపథ్యంలో 5గురు రెవెన్యూ ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. వీటన్నింటి దృష్ట్యా రెవెన్యూశాఖను ప్రక్షాళన చేసేందుకు బదిలీలు చేశారు. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం సత్పలితాలిస్తుందో.. లేదో తెలియాలంటే కొంత కాలం వేచిచూస్తేనే తెలుస్తుందని అధికార వర్గాల్లో చర్చోచర్చలు జరుగుతున్నాయి.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...