స్కైవేలను అడ్డుకున్నారు.. నగరాన్ని సతాయిస్తున్నారు


Fri,July 12, 2019 02:01 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌లో ట్రాఫిక్, రవాణా వ్యవస్థను మెరుగు పర్చేందుకు లీ అసోసియేట్స్ అనే కన్సల్టెంట్ ఆధ్వర్యంలో గతంలో సమగ్ర రవాణా అధ్యయనం(సీటీఎస్) నిర్వహించారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో సుమారు రూ. 23 వేల కోట్లతో వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్‌డీపీ)ని చేపట్టింది. ఇందులో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో మల్టీలెవల్ ైఫ్లెఓవర్లు, ఎక్స్‌ప్రెస్ వేలు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. మొదటి దశలో సుమారు రూ. 3000 కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల్లో ఇప్పటికే శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో మూడు అండర్‌పాస్‌లు, నాలుగు ైఫ్లెఓవర్లను నిర్మించారు. మిగిలిన ప్రాంతాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. వీటితో పాటు లీ కన్సల్టెంట్ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ట్రాఫిక్ కోసం స్కైవేలు నిర్మించాల్సి ఉంది. ఇందులో కంటోన్మెంట్ మీదుగా సాగే రెండు మార్గాలు అతి ప్రధానమైనవి. ఓఆర్‌ఆర్-తూముకుంట-ఆల్వాల్-తిరుమలగిరి-జేబీఎస్ వరకు రాజీవ్ రహదారిపై సుమారు 19 కిలోమీటర్ల మేర స్కైవే నిర్మించేందుకు సుమారు రూ. 1900 కోట్లు, అలాగే, పారడైజ్ నుంచి బోయిన్‌పల్లి మీదుగా సుచిత్ర వరకు ఎన్‌హెచ్-44పై స్కైవే నిర్మాణానికి రూ. 1200 కోట్లతో ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో రాజీవ్ రహదారిపై ప్రతిపాదిత స్కైవేకు సంబంధించి సమగ్ర ప్రాజక్ట్ నివేదిక (డీపీఆర్) కూడా సిద్ధంచేశారు. ఈ మార్గంలో ఆస్తులు కోల్పోయేవారికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని అంచనాలు తయారుచేశారు. ప్రస్తుతం ఈ మార్గం 40 నుంచి 60 అడుగుల వెడల్పు ఉండగా, దాన్ని 150-200 అడుగుల మేరకు విస్తరించాలని నిర్ణయించారు. ఎన్‌హెచ్-44పై స్కైవే నిర్మాణంతో కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ తదితర జిల్లాలు, అలాగే, రాజీవ్ రహదారి స్కైవేతో మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మేడ్చల్ తదితర జిల్లాల నుంచి వచ్చే ట్రాఫిక్‌కు ఎంతో ఉపశమనం కలుగుతుంది. ప్రస్తుతం ఆయా జిల్లాల నుంచి వచ్చే వాహనాలు నగర శివార్లకు చేరుకునేందుకు పడుతున్న సమయంలో దాదాపు సగం శివార్ల నుంచి నగరం లోనికి చేరుకునేందుకు పడుతున్నది. నగరంలో సుమారు 12 నుంచి 15 కిలోమీటర్ల దూరాన్ని దాటేందుకు కనీసం గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతున్నది. ఈ రెండు స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖకు చెందిన దాదాపు 100 ఎకరాల స్థలాన్ని సేకరించాల్సి ఉండగా, రక్షణశాఖ అందుకు ఒప్పుకోకపోవడంతో స్కైవేల ప్రతిపాదన రక్షణశాఖ వద్ద పెండింగులో ఉన్నది.

బెంగళూరులో ఇచ్చి ఇక్కడ పెండింగ్ పెట్టారు....
ప్రైవేట్ ఆస్తుల యజమానులు ఒప్పుకుంటున్నా అసలు సమస్యల్లా కంటోన్మెంట్‌తోనే వస్తున్నది. ఇవికాకుండా రెండు మార్గాల్లో రక్షణ శాఖకు చెందిన సుమారు 100 ఎకరాల స్థలాన్ని సేకరించాల్సి ఉండగా, దానికి బదులుగా నగరం వెలుపల రాష్ట్ర ప్రభుత్వం రూ. 600 ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు ప్రతిపాదించింది. గతంలో బెంగళూరులో మౌలిక సదుపాయాల కల్పనకు అక్కడి ప్రభుత్వం 210 ఎకరాల రక్షణ స్థలాన్ని సేకరించి దానికి బదులుగా వారికి స్థలాన్ని ఇచ్చింది. ఈ క్రమంలోనే మన నగరంలో కూడా ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న స్కైవేల నిర్మాణానికి స్థలాన్ని ఇవ్వాలని గత ఎన్‌డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు విజ్ఞప్తి చేసింది. అయినా అక్కడి నుంచి ఇంత వరకు ఎటువంటి ఫలితం రాలేదు. భూ సేకరణలో కోల్పోతున్న భవనాలపై తమకు ఏటా ఆస్తిపన్ను రూపంలో వచ్చే రూ. 30 కోట్లు యథావిధిగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా తమకు చెల్లించాలని కంటోన్మెంట్ అధికారులు పేచీ పెడుతున్నారు. బాధితులకు నష్ట పరిహారం చెల్లించి తాము ఆస్తులు సేకరించిన తర్వాత ఆస్తిపన్ను కంటోన్మెంట్‌కు ఎలా చెల్లిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 100 ఎకరాలకు బదులు నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లాలోనే 600 ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చినా రక్షణశాఖ గొంతెమ్మ కోర్కెలు కోరుతూ ఆచరణ సాధ్యంకాని వాదనలతో స్కైవేల నిర్మాణాన్ని అడ్డుకుంటున్నది. దీంతో ఉత్తర తెలంగాణకు చెందిన పలు జిల్లాలకు చెందినవారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ చేరుకోలేక పోతున్నారు.

స్కైవేల ప్రతిపాదనలు ఇలా...
-ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్ట్ అంచనా వ్యయం- రూ. 23వేల కోట్లు
-మొదటి దశలో ఇప్పటికే మూడు అండర్‌పాస్‌లు, నాలుగు ైఫ్లెఓవర్లు పూర్తి
-రాజీవ్ రహదారి, ఎన్‌హెచ్-44లపై స్కైవేల ప్రతిపాదన
-కంటోన్మెంట్‌లో సేకరించాల్సిన రక్షణశాఖ స్థలం 100 ఎకరాలు
-దీనికి బదులుగా ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో 600ఎకరాలు ఇచ్చేందుకు సంసిద్ధత

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...