ఆషాఢ జాతర.. కోటలో వేడుక


Fri,July 12, 2019 01:58 AM

-గోల్కోండ జగదాంబిక అమ్మవారికి మూడో బోనం
-భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
-ఘనంగా అభిషేకం, అర్చనలు
-బోనాలు, తొట్టెలను సమర్పించుకున్న భక్తులు
మెహిదీపట్నం: గోల్కొండ కోటలో మూడో బోనాల పూజలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నగీనాబాగ్, బాలహిస్సార్ తదితర ప్రాంతాల ప్రజలు బోనాల జాతర జరుపుకున్నారు. సాధారణంగా గురు, ఆదివారాల్లో మాత్రమే బోనాలను జరుపుకోవడం గోల్కొండలో ఆనవాయితీగా వస్తున్నది. కానీ ఇప్పుడు అన్ని రోజుల్లో బోనాలను జరుపుకొని మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు వస్తున్నారు. గోల్కొండ కోటలో బోనాలు ఎంతో సంబురంగా జరిగాయి. భక్తులు బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. జగదాంబిక ఎల్లమ్మ ఆలయ ఈవో మహేందర్‌కుమార్, బోనాల ఉత్సవాల కమిటీ చైర్మన్ జి.వసంత్‌రెడ్డిలు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు.

అమ్మవారికి అభిషేకం..
గోల్కొండ కోటలో మూడో బోనం సందర్భంగా జగదాంబిక ఎల్లమ్మకు గురువారం ఆలయ ఈవో మహేందర్‌కుమార్, బోనాల ఉత్సవాల కమిటీ చైర్మన్ జి.వసంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పూజారి సర్వేశ్వర్ ఉదయం అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చనలు చేసి అమ్మవారికి భక్తులు తెచ్చిన ఒడి బియ్యం పోశారు. రాత్రి హారతితో పూజలు ముగిశాయి.

భక్తుల సేవలో ప్రభుత్వ శాఖలు..
గోల్కొండ బోనాలను జరుపుకోవడానికి వస్తున్న భక్తులకు ప్రభుత్వ శాఖల అధికారులు సేవలు అందిస్తున్నారు. వేడుకల సందర్భంగా జలమండలి డివిజన్-3 జీఎం వినోద్‌భార్గవ్ ఆధ్వర్యంలో మేనేజర్ సాజిద్, వర్క్ ఇన్‌స్పెక్టర్ బి,నర్సింగ్‌రావులు తమ సిబ్బందితో కలిసి నీటిని నిరంతరం సరఫరా చేస్తున్నారు. వైద్య సేవలను డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో ఈశ్వరి తన సిబ్బందితో కలిసి అందిస్తున్నారు. ఇదిలా ఉండగా భక్తులకు శాంతిభద్రతల పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆసిఫ్‌నగర్ ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డి నేతృత్వంలో గోల్కొండ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి బందోబస్తును నిర్వహిస్తున్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...