సేవ చేయడంలోనే సంతృప్తి


Thu,July 11, 2019 01:13 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కోట్ల రూపాయలు సంపాధించినా దక్కని సంతృప్తి.. ఇతరులకు సహాయం చేయడంలోనే కలుగుతుందని మత్స్య, పశు సంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తాజ్‌దక్కన్ హోటల్‌లో బుధవారం యాపిల్ హోమ్, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో షీ నీడ్ లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ ఒక మినీ ఇండియా అని ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇక్కడ అన్ని మతాల ప్రజలు స్వేచ్ఛగా నివసిస్తారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా.. హైదరాబాద్‌కు వస్తేనే బాగా అనిపిస్తుందని అన్నారు. పేదల ఆకలి తీర్చడంలో యాపిల్ హోమ్ ఫౌండర్ డాక్టర్ నీలిమ కృష్ణ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. మహిళలకు అవసరమయ్యే కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న రిఫ్రిజిలేటర్లకు అవసరమయ్యే కరెంట్, స్థలం ప్రభుత్వం చూపిస్తుందని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తాగునీరు, శాంతి భద్రతలు, విద్యుత్ తదితర సౌకర్యాలతో హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. అమీర్‌పేటలో సీనియర్ సిటిజన్స్ కొంతమంది వేసవి సమయంలో గ్రూపుగా ఏర్పడి అన్నదానం చేసే కార్యక్రమం చేపట్టడం ప్రశంసనీయమన్నారు. అలాంటి వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

తెలంగాణలో శాంతిభద్రతలు అద్భుతం : లక్ష్మీపార్వతి
తెలంగాణలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీపార్వతి అన్నారు. మహిళల రక్షణకు పోలీసులు అహార్నిశలు పనిచేస్తున్నారని కొనియాడారు. తలసాని తనకు కొడుకులాంటి వాడని చెప్పారు. షీ నీడ్ కార్యక్రమంతో మహిళలకు రక్షణగా నిలుస్తున్న నీలిమకు అభినందనలు తెలిపారు. ఏపీలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగేలా చూస్తామని అన్నారు. దేశంలో 55 శాతం పేదరికంతో బాధపడుతున్నారని, ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆకలి తీర్చేందుకు రిఫ్రిజిరేటర్లు ఏర్పాటు : హరిచందన
నగరంలో 22 శాతం మంది ఆకలితో బాధపడుతున్నారని, అలాంటి వారి కోసం పలు ప్రాంతాల్లో రిఫ్రిజిరేటర్లు ఏర్పాటు చేశామని జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ హరిచందన అన్నారు. ఇంట్లో, ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని అందులో ఉంచాలని చెప్పారు. ఆకలితో ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో అమ్మాయిలు వారి పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్స్ ఉపయోగించడంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ షీ నీడ్‌తో శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. షీ నీడ్‌కు సహకరించిన వారందరికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మెమొంటోలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ముషారఫ్ ఫరూకీ, ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ఎవిత ఫెర్నాండేజ్ తదితరులు పాల్గొన్నారు.

పలు ప్రాంతాల్లో కియోస్క్‌ల ఏర్పాటు
నగరంలోని అన్ని ప్రధానమైన ప్రాంతాల్లో అత్యాధునిక కియోస్క్‌లను ఏర్పాటు చేసి, ఒక్కో కియోస్క్‌కు 50 శానిటరీ ప్యాట్స్ చొప్పున అందుబాటులో ఉంచనున్నారు. బటన్ నొక్కగానే ప్యాడ్స్ వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు. అంతేకాకుండా కియోస్క్‌కు పక్కన ఇన్సినెరేటర్ ఏర్పాటు చేస్తారు. అందులో వాడేసిన ప్యాడ్స్, బయో వ్యర్థాలను వేసి కాల్చివేసేందుకు కూడా వీలు కల్పిస్తారు. అవసరాన్ని దృష్ట్యా శానిటరీ ప్యాడ్స్ పెంచడం జరుగుతుందని డాక్టర్ నీలిమా తెలిపారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...