ఎల్లమ్మా.. దీవించమ్మా!!


Wed,July 10, 2019 12:42 AM

-బల్కంపేటలో ఘనంగా కల్యాణ వేడుక
-పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రులు
-ఘనంగా ఏర్పాట్లు
అమీర్‌పేట్, నమస్తే తెలంగాణ:బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం వైభవంగా జరిగింది. అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం ఉదయం 11-07 నిమిషాలకు హస్తా నక్షత్రయుక్త కన్యాలగ్న సుమూహుర్తంలో కల్యాణం నిర్వహించారు. సాంప్రదాయానుసారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దంపతులు అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. అందంగా తీర్చిదిద్దిన వేదికపై అంగరంగ వైభవంగా జరిగిన అమ్మవారి కల్యాణాన్ని దూరం నుంచి క్యూ లైన్లలోని భక్తులు కూడా చక్కగా వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కల్యాణాన్ని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ దంపతులతో పాటు ఎమ్మెల్యే హరీశ్‌రావు, టీఆర్‌ఎస్ యువజన విభాగం నాయకులు తలసాని సాయికిరణ్ యాదవ్ దంపతులతో పాటు అమీర్‌పేట్ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి తదితరులు తిలకించారు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ బారికేడ్ల నిర్మాణాలపై ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులతో చేసిన నిరంతర సమీక్షలు చక్కటి ఫలితాలిచ్చాయి. గతంలో వీఐపీలు వచ్చిన సమయంలో సాధారణ భక్తుల క్యూలైన్లను నిలుపు చేసేవారు. అయితే ఈ సారి బారికేడ్ల నిర్మాణాలు వీఐపీలు వచ్చినా సాధారణ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చేసిన డిజైన్ సత్ఫలితాలనిచ్చిందని చెప్పవచ్చు. డీకే రోడ్డు మార్గం నుంచి.. బల్కంపేట పెట్రోల్ పంపు మార్గాల నుంచి ఏర్పాటు చేసిన బారికేడ్లు భక్తులకు ఇబ్బందులు లేకుండా చేశాయి. దీంతో పాటు అడుగడుగునా పోలీసుల పర్యవేక్షణతో పాటు వలంటీర్ల సేవలు వేడుకలను ప్రశాంతంగా కొనసాగేలా చేయడంలో దోహదపడ్డాయి.

పసుపుమయమైన వసతి గృహం ....
అమ్మవారి కల్యాణ వేడుకల్లో మరో ముఖ్య ఘట్టం శివసత్తులతో జరిగే కల్యాణ మహోత్సవం. శివసత్తులు అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకలు చూడడానికి వసతి గృహానికి చేరుకుంటారు. ఇక్కడకు వచ్చే భక్తులంతా పసుపును పూసుకుంటుండటంతో ఈ పరిసరాలన్నీ పసుపు వర్ణంగా మారిపోయాయి.

హాజరైన ప్రముఖులు..
ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి ప్రముఖులు తరలివచ్చారు. మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులతో పాటు ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, బేతి సుభాష్‌రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సతీమణి కావ్యారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు బూర్గుల శ్యాంసుందర్‌గౌడ్, లింగంపల్లి నర్సింగ్‌రావు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

అన్నదాన శిబిరాలు...
అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు బల్కంపేటకు వస్తున్న వారికి కడుపు నిండా అన్నం పెట్టి పంపే సాంప్రదాయాన్ని బల్కంపేట, ఎస్‌ఆర్‌నగర్ నివాసితులు కొనసాగించారు. కనీసం 5 క్వింటాళ్ల నుండి 20 క్వింటాళ్ల వరకు వండి వడ్డించే శిబిరాలు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ నలుదిశలా వెలిశాయి. ఇక కొందరు అమ్మవారి ప్రసాదం పులిహోరను పంచి పెట్టారు. దాదాపు 100 పైగా అన్నదాన శిబిరాలు నెలకొన్నాయి.

పండుగలు గొప్పగా జరుగాలి: మంత్రి తలసాని
మతాలకు అతీతంగా పండుగలు గొప్పగా జరుగాలన్నదే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. అమ్మవారి కల్యాణోత్సవాన్ని విజయవంతం చేయడంలో అన్ని విభాగాల అధికారులు, రాజకీయాలకు అతీతంగా వివిధ పక్షాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, బల్కంపేటకు చెందిన ప్రముఖులు, నివాసితుల కృషి ఎంతో ఉందన్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు పూలతో అందంగా అలంకరించిన రథంలో ఉంచి అమ్మవారిని ప్రతిష్ఠించి బల్కంపేట వీధుల్లో ఊరేగిస్తారని, ఈ రథోత్సవం ఇక్కడి పరిసరాల్లో ఊరేగింపు జరుపుకున్న తర్వాత ఆలయానికి చేరడంతో వేడుకలు ముగుస్తాయన్నారు. వేడుకల విజయవంతానికి గత నెల రోజులుగా ఎల్లమ్మ దేవాలయ ఈవో ఎం.వి.శర్మ మొదలు సిబ్బంది వరకు ప్రతిఒక్కరూ కృషి చేశారని ఈ సందర్భంగా మంత్రి తలసాని అభినందించారు.

భక్తులకు ఇబ్బందులు రాకుండా..
ఎల్లమ్మ కల్యాణోత్సవాలు విజయవంతం చేసేందుకు వారం రోజులుగా నిత్యం అధికారులతో సంప్రదింపులు, ఏర్పాట్ల పర్యవేక్షణతో పాటు మహంకాళి అమ్మవారి ఆషాఢ జాతర ఏర్పాట్లు కూడా మంత్రి తలసాని పర్యవేక్షించారు. వేడుక జరుగుతుండగా మధ్య మధ్యలో క్యూలైన్లలో భక్తులకు మంచినీటి ప్యాకెట్లు అందుతున్నాయా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అనే విషయాలను దగ్గరుండి పరిశీలించారు. కల్యాణం జరిగిన తర్వాత సకుటుంబ సమేతంగా అమ్మవారి ఆశీస్సులు అందుకున్న మంత్రి తలసాని, ఆ తర్వాత తన మనవడు తలసాని సాయి తారక్‌తో ఉల్లాసంగా గడిపారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...