జరిమానాలో ఐటీ జోన్ టాప్ !


Wed,July 10, 2019 12:35 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగనంలో ఐటీ హబ్‌గా పేరుగాంచిన వెస్ట్‌జోన్ ప్రాంతం అపరిశుభ్రత, నిబంధనల ఉల్లంఘనలో కూడా ముందంజలో నిలిచింది. గడచిన నెలన్నర రోజుల్లో ఈ ప్రాంతంలోని శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లలో దాదాపు 352 మంది నిబంధనలను ఉల్లంఘిస్తూ బల్దియా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలకు అడ్డంగా దొరికిపోయారు. వారినుంచి బల్దియా రూ.16లక్షలకుపైగా జరిమానాలు వసూలుచేసింది.
స్వచ్ఛభారత్ ర్యాంకుల్లో నగరాన్ని అగ్రభాగాన నిలిపే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ నగరంలో పరిశుభ్రతను పెంపొందించేందుకు అనేక రకాల వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే స్వచ్ఛభారత్ ర్యాంకుల్లో వరుసగా మూడుసార్లు దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిన ఇండోర్ నగరం ఆదర్శంగా సాఫ్ హైదరాబాద్-షాన్‌దార్ హైదరాబాద్ పేరుతో పరిశుభ్రతకోసం వివిధ రకాల చర్యలు చేపడుతున్నారు. స్వచ్ఛతపై ఓ వైపు ప్రజల్లో చైతన్యం తెస్తూనే మరోవైపు, ప్రజల అలవాట్లలో మార్పుకోసం కొంత కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. ఈ క్రమంలోనే నిబంధనలను ఉల్లంఘించేవారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఈ ఏడాది మే నెల 24వ తేదీ నుంచి బల్దియా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. పరిశుభ్రతకు విఘాతం కల్గించేవారిని గుర్తించి వెంటనే జరిమానాలు విధిస్తున్నారు. రోడ్డుపై ఉమ్మివేసినా వదలకుండా జరిమాన విధిస్తున్నారు. రోడ్డుపై, నాలాల్లో వ్యర్థాలు పారేయడం, వ్యర్థ జలాలను రోడ్డుపైకి వదలడం, అనుమతిలేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేయడం తదితర అంశాలు ఇందుకు ప్రధానమైనవి.

మల్కాజిగిరిలో అతితక్కువ..
బల్దియాలోని 30సర్కిళ్లలో గడచిన నెలన్నర రోజుల్లో మొత్తం 30సర్కిళ్లలో 3101మందిని నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి వారికి రూ. 4730850 జరిమానాలు విధించారు. ఇందులో ఐటీ జోన్‌లోని శేరిలింగంపల్లి, చందానగర్ ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. అన్ని సర్కిళ్లకంటే అత్యధికంగా చందానగర్‌లో 246 మంది నుంచి రూ. 927800 జరిమానాలు వసూలుచేయగా, శేరిలింగంపల్లిలో 106 మంది నుంచి రూ. 761500 జరిమానాలు వసూలుచేశారు. దాదాపు మూడింట ఒకవంతు జరిమనాలు ఈ రెండు సర్కిళ్లలోనే విధించడం గమనార్హం. కోర్‌సిటీలోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అంబర్‌పేట్, ముషీరాబాద్, గోషామహల్ తదితర సర్కిళ్లలో సుమారు ఒక లక్షన్నరనుంచి నాలుగు లక్షల వరకూ జరిమానాలు విధించారు. కాగా, పాతబస్తీ ప్రాంతంలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, సంతోషనగర్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, కార్వాన్ తదితర ప్రాంతాల్లో జరిమానాలు కేవలం రూ. 30వేల నుంచి 90 వేల లోపు ఉండడం విశేషం. మల్కాజిగిరిలో అతితక్కువగా ఐదుగురినుంచి రూ. 4800 జరిమానాలు వసూలుచేశారు.

క్రమశిక్షణను అలవర్చేందుకే జరిమానాలు : దానకిశోర్
జరిమానాల్లో ఒక సర్కిల్‌కి, మరో సర్కిల్‌కి పొంతనలేకుండా ఉంది. కొన్ని సర్కిళ్లలో జరిమానాల బారినపడినవారి సంఖ్య సింగిల్ డిజిట్ దాటకపోగా, మరికొన్ని సర్కిళ్లలో వందల సంఖ్యలో ఉంది. పాతబస్తీతోపాటు మల్కాజిగిరి, యూసుఫ్‌గూడ, గాజులరామారం, కుత్బుల్లాపూర్ తదితర సర్కిళ్లలో నామమాత్రంగా తనిఖీలు నిర్వహించినట్లు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. తనిఖీల్లో శాస్త్రీయ పద్ధతిని అవలంభించకపోవడం వల్ల జరిమానాల్లో సర్కిళ్ల మధ్య భారీగా తేడాలు చోటుచేసుకున్నాయి. మొత్తం మీద నిబంధనల ఉల్లంఘనకు ఫుల్‌స్టాప్ పడేవరకూ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని కమిషనర్ దానకిశోర్ హెచ్చరిస్తున్నారు. జరిమానాలు విధించడం బల్దియా ఆదాయాన్ని పెంచుకోడానికి కాదని, ప్రజల అలవాట్లలో మార్పు తెస్తూ కొంత క్రమశిక్షణను అలవాటుచేసేందుకేనని ఆయన స్పష్టంచేస్తున్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...