పరిష్కారానికి ప్రత్యేక విభాగం..


Wed,July 10, 2019 12:33 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జలమండలి, జీహెచ్‌ఎంసీలో స్వయం సహాయక బృందాల కోసం ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. స్వయం సహాయక సభ్యులు ఇచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి త్వరగా పరిష్కరిస్తామని వివరించారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా, గోదావరి నదుల నుంచి నగరానికి తీసుకువచ్చి సరఫరా చేస్తున్న నీటిని నగరవాసులు వృథా చేయడం వల్ల ప్రతి రోజూ 50 మిలియన్లు రోడ్డు పాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు నీటి విలువ తెలియక వృథా చేస్తున్నారన్నారు. నగర వాసులు ఇంటి వద్ద వృథా చేస్తున్న నీటితో చెన్నై నగరానికి ఒక రోజు మంచినీటి సరఫరా చేయవచ్చని వివరించారు. వాక్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని స్వయం సహాయక బృంద ప్రతినిధులతో మంగళవారం ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ దానకిశోర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంట్లో డబ్బులు పెట్టి కొనుక్కునే వాటిని పొదుపుగా వాడి, నీటిని మాత్రం ఇష్టానుసారంగా వృథా చేస్తున్నామని అభిప్రాయపడ్డారు. 150 వార్డుల్లో ఎన్ని రకాలుగా నీరు వృథా అవుతుందో గుర్తించి, వాటిని అరికట్టడానికి పరిష్కార మార్గాలను ఆన్వేషించాలని సూచించారు. స్వయం సహాయక బృంద సభ్యులు నీటి పొదుపు కోసం నీటి నాయకత్వం వహించాలని ఎండీ తెలిపారు. స్వయం సహాయక బృందాలు ఇప్పటికే గుర్తించిన సాఫ్ హైదరాబాద్ షాన్ హైదరాబాద్ 150 వార్డుల్లో కలుషిత నీటి సమస్య, పైపులైన్ లీకేజీలను గుర్తించాలని సూచించారు. వచ్చే శనివారం నిర్వహించే సమావేశంలో అధికారుల దృష్టికి వివరాలను తీసుకురావాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని నాలుగు లక్షల స్వయం సహాయక బృందాల కుటుంబాలు నీటి వృథాను అరికడితే రోజుకు 10 మిలియన్ గ్యాలన్ల నీరు పొదుపు చేసిన వారౌతారని అన్నారు. ఈ సమావేశంలో జలమండలి డైరెక్టర్లు డాక్టర్ పీఎస్ సూర్యనారాయణ, డి. శ్రీధర్ బాబు, బి. విజయ్‌కుమార్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు, ఉన్నతాధికారులు, స్వయం సహాయక బృంద సభ్యులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...