నాటకం..సృజన రూపకం


Tue,July 9, 2019 01:02 AM

-తొలిసారి రాష్ట్ర స్థాయి విద్యార్థుల నాటక పోటీలు
-8 నుంచి 10వ తరగతి విద్యార్థులే అర్హులు
-ఈ నెల 20లోపు అకాడమీలో నమోదు చేసుకోవాలి
-సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు రవీంద్రభారతిలో ప్రదర్శన
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : విద్యార్థుల్లో సృజనాత్మకతను, కళాత్మక విలువలను పెంపొందించడానికి నాటకానికి మించిన మాధ్యమం మరొకటి లేదు. తెలుగు రంగస్థలం, చలన చిత్ర రంగంలో రాణించిన మేటి నటులు చాలా వరకు విద్యార్థి దశలోనే నటనకు శ్రీకారం చుట్టినవారేనన్నది గమనార్హం. స్పర్థయా వర్థతే విద్య అన్నట్టు నాటక ప్రదర్శనలో కూడా పోటీ తత్తం నెలకొల్పితేనే విద్యార్థుల్లోని కళాత్మకత వెల్లువెత్తడానికి అవకాశముంటుందన్న ఆకాంక్షతో విద్యార్థులకు నాటిక పోటీలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం, సంగీత నాటక అకాడమీ సంకల్పించింది.

మూడు రోజుల పాటు పోటీలు
తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రభుత్వ, గుర్తింపు పొందిన, ప్రైవేటు పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు నాటక పోటీలను రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నారు. స్క్రూట్నీ ఆగస్టు నుంచి మొదలవుతుంది. ఆసక్తి గల పాఠశాలలు నాటిక వివరాలు పొందుపరుస్తూ దరఖాస్తులను బాద్మి శివ కుమార్, చైర్మన్, తెలంగాణ సంగీత నాటక అకాడమీ, కళాభవన్, రవీంద్రభారతి, సైఫాబాద్, హైదరాబాద్-04 అనే చిరునామాకు వ్యక్తిగతం, పోస్టు ద్వారా కానీ, ఈ-మెయిల్:- టీఎస్‌ఎన్‌ఏ.హెచ్‌వైడీ@యాహూ.కామ్ ద్వారా గాని సమర్పించవచ్చని తెలిపారు.

వివరాలు ఇలా..
-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లోని 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు మాత్రమే పోటీల్లో పాల్గొనాలి
-ఒక పాఠశాల నుంచి ఒక నాటికకు మాత్రమే అవకాశం ఉంటుంది
-ప్రదర్శన నిడివి 30 నిమిషాల నుంచి 45 నిమిషాలు మాత్రమే ఉండాలి
-ఇతివృత్తాలు ఏవైనా ప్రదర్శించొచ్చు. కానీ, ప్రభుత్వాన్ని విమర్శించడం, కుల, మత వర్గాల వారి మనోభావాలను కించపరిచే విధంగా ఉండకూడదు
-జూలై 20వ తేదీలోపు పోటీలో పాల్గొనే వారు అంగీకారం తెలుపుతూ ప్రాథమిక సమాచారంతో అకాడమీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది
-పోటీలో పాల్గొనే వారు ఆగస్టు 15వ తేదీలోపు పూర్తిస్థాయి సమాచారంతో తెలంగాణ సంగీత నాటక అకాడమీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి
-ప్రదర్శనకు మైక్, లైటింగ్, సాధారణ పరదాలు మాత్రమే ఏర్పాటు చేస్తారు
-నాటిక ప్రదర్శన రోజు భోజనం ఏర్పాట్లు ఉంటాయి
-పోటీలో పాల్గొనడానికి ఎన్ని నాటకాలు ఎంపిక చేయాలో కమిటీదే తుది నిర్ణయం
-జిల్లా స్క్రూట్నీ ద్వారా ఎంపికైన నాటికలు మాత్రమే ప్రదర్శనకు అనుమతిస్తారు.

విజేతలకు బహుమతులు..
పోటీల్లో గెలిచిన బృందాలకు మొదటి బహుమతి కింద రూ.25,000, రెండో బహుమతి రూ.20,000, మూడో బహుమతి రూ.15,000, ఇంకా ఐదు జ్యూరీ బహుమతులు ఒక్కొక్కరికి రూ.5000 అందజేస్తారు. ప్రదర్శనలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు జ్యూరీ అవార్డులు ఉత్తమ నటుడు/ నటి, ఉత్తమ హాస్య నటుడు/ నటి, ఉత్తమ సహాయ నటుడు/ నటి, ఉత్తమ ప్రతి నాయకుడు/ ప్రతి నాయిక, ఉత్తమ మేకప్, ఉత్తమ సెట్ డిజైన్, ఉత్తమ లైటింగ్, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ రచనలకు కూడా బహుమతిగా రూ.1116 ఇవ్వనున్నారు. ప్రదర్శనలో పాల్గొన్న అన్ని బృందాల వారికి తెలంగాణ సంగీత నాటక అకాడమీ సర్టిఫికెట్లను ప్రదానం చేస్తుంది. పోటీలో పాల్గొన్న ప్రతి నాటికకు నగదు ప్రోత్సాహకం అందజేస్తారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...