సోలార్ పెంచుతున్నారు..గ్రిడ్‌కు పంపుతున్నారు


Tue,July 9, 2019 01:01 AM

-టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో పెరుగుతున్న సౌర వెలుగులు
-ఇప్పటివరకు 4,080 మంది నెట్ మీటరింగ్‌కు దరఖాస్తు
-108 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి
-ఒక్క గ్రేటర్‌లోనే 75.7 మెగావాట్లు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ హితంలో భాగంగా సౌర విద్యుత్‌ను భారీగా ప్రోత్సహిస్తున్నది. అందులో భాగంగానే రాష్ట్రంలో పెరుగనున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా సోలార్ రూఫ్‌టాప్ నెట్ మీటరింగ్ పథకంలో వినియోగదారులకు రాయితీలిచ్చి సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. అందుకోసమే పట్టణ ప్రాంతాల్లోని కేటగిరీ-1, కేటగిరీ-2 వినియోగదారులకు సైతం సౌర విద్యుత్ ఉత్పాదనలో భాగస్వామ్యం కల్పించేందుకు సోలార్ రూఫ్‌టాప్ నెట్ మీటరింగ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంతో మన ఇంటిపైనే విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకొనే వెసులుబాటు కల్పించింది. ఒక్కసారి ఇన్‌స్టాల్ చేసుకున్న సోలార్ ప్లాంటుతో దీర్ఘకాలికంగా లబ్ధి పొందవచ్చు. దీంతో పాటు డిస్కమ్‌లకే విద్యుత్‌ను విక్రయించి ఆర్థికంగా బలపడే అవకాశం ఉన్నది.

4వేల మందికి పైగా దరఖాస్తులు..
సొలార్ రూఫ్‌టాప్ నెట్ మీటరింగ్ పథకంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) పరిధిలో ఇప్పటి వరకు 4080 మంది వినియోగదారులు సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3990 మంది ఇప్పటికే ప్లాంట్లను నిర్మించుకొని విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. మరో 90 మంది వినియోగదారుల దరఖాస్తులు వివిధ స్థాయిలో పరిశీలనలో ఉన్నాయి. అయితే 3990 మంది 108.9 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. మిగిలిన 90 మంది సైతం సోలార్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయితే.. మొత్తంగా 110 మెగావాట్ల సొలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. ఇదిలావుంటే.. టీఎస్‌ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్‌లో సింహభాగం గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఉత్పత్తి అవుతుండటం గమనార్హం. నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలలో కలుపుకొని 33.83 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతున్నది.

ఒక్క యూనిట్‌కు రూ.4 పైనే..
సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఇంటి అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. దీనికి ఒక మీటర్‌ను ఏర్పాటు చేస్తారు. నెల మొత్తంలో ఎన్ని యూనిట్ల విద్యుత్ గ్రిడ్‌కు వెళ్లిందో.. పరిశీలించి ఆ మేరకు టీఎస్‌ఎస్పీడీసీఎల్ అధికారులు యాజమానికి చెల్లిస్తారు. దీంతో ఇంటి విద్యుత్ వినియోగ భారం తగ్గడంతో పాటు మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు ఇవ్వడం వల్ల కొంత మొత్తం నగదు తిరిగి పొందవచ్చు. అయితే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ.. సోలార్ రూఫ్‌టాప్ నెట్ మీటరింగ్‌లో భాగంగా వినియోగదారుల నుంచి కొనుగోలు చేసిన ఒక్కో యూనిట్‌కు రూ.4.097 చెల్లిస్తుంది.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...