ఇక సాయంత్రం వేళల్లోనూ చెత్త తరలింపు


Tue,July 9, 2019 12:57 AM

-వీధి వ్యాపారులు డస్ట్‌బిన్ ఏర్పాటు చేసుకోవాలి -బల్దియా కమిషనర్ దానకిశోర్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రతి వీధి వ్యాపారి వ్యర్థాలు వేసేందుకు తప్పనిసరిగా వారం రోజుల్లోగా డస్ట్‌బిన్‌ను ఏర్పాటు చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ సూచించారు. రోడ్లను ఎంత శుభ్రం చేస్తున్నా.. వీధి వ్యాపారుల వల్ల రాత్రివేళల్లో రోడ్లపై చెత్త పేరుకుపోతోందన్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి వీధి వ్యాపారులంతా వారం రోజుల్లో డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి కమిషనర్ సాఫ్ హైదరాబాద్-షాన్‌దార్ హైదరాబాద్‌పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలో గుర్తించిన 161 సమస్యాత్మక ముంపు ప్రాంతాల్లో చుట్టూ 500 మీటర్లవరకు ఏ విధమైన హాకర్లు, చిరు వ్యాపారులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే సోమవారం నుంచి సాయంత్రం వేళల్లో కూడా చెత్తను తరలించేందుకు ప్రతి సర్కిల్‌కు నాలుగు చొప్పున వాహనాలు, బాబ్‌కాట్‌లను సమకూర్చనున్నట్లు చెప్పారు.

నీరు వృథా....
నగరంలో ప్రస్తుతం రోజుకు 420 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా చేస్తుండగా, అందులో 50మిలియన్ గ్యాలన్లు రోడ్డుపై వృథాగా వదులుతున్నారని కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. వృథా అవుతున్న నీరు చెన్నై నగరానికి సరఫరా చేస్తున్న మంచినీటితో సమానమని ఆయన తెలిపారు. నీటిని వృథా చేసేవారిని గుర్తించి భారీగా జరిమానాలు విధించాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ అధికారులు ఉదయం ఏడు గంటలకల్లా క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యర్థాల పాయింట్ల తొలగింపు ప్రక్రియపై ఫొటోలతో కూడిన నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. హరితహారం కోసం ప్రైవేటు నర్సరీలనుంచి మొక్కలు సేకరించేందుకు టెండర్ల ప్రక్రియను సడలించాలని కోరారు.

అలసత్వం వహిస్తే కఠిన చర్యలు....
సాఫ్‌హైదరాబాద్ షాన్‌దార్ హైదరాబాద్ విజయాలు, రానున్న కాలంలో చేపట్టే కార్యక్రమాలపై శాసనసభ్యులు, కార్పొరేటర్లకు వివరించేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమానికి సుమారు మూడుకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంటూ, స్వచ్ఛ పనుల్లో అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. అదనపు కమిషనర్లు అమ్రపాలి, అద్వైత్‌కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజీత్, ముఖ్య ప్రణాళికాధికారి దేవేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు సురేశ్, శ్రీధర్, జియావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...