బోనం వైభోగం


Mon,July 8, 2019 12:15 AM

మెహిదీపట్నం: గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక ఎల్లమ్మకు రెండో బోనం సమర్పించేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారికి బోనం సమర్పించి చల్లగా చూడాలని వేడుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా కార్వాన్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఠాకూర్ జీవన్‌సింగ్ ఆధ్వర్యంలో ఈవో మహేందర్‌కుమార్, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ వసంత్‌రెడ్డి, సభ్యులు కోయల్‌కార్ శ్రీనివాస్, మనోహర్, భాను, శివశంకర్, సత్యనారాయణ గౌడ్, తూముకుంట లహరి, మాజీ ఛైర్మన్‌లు గోవింద్‌రాజ్, వినోద్, తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఏసీపీలు నంద్యాల నర్సింహారెడ్డ్డి, ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో శాంతి భద్రతలను పర్యవేక్షించారు. అదేవిధంగా భక్తులకు మంచి నీటి సమస్యలు తలెత్తకుండా జలమండలి డివిజన్ -3 జీఎం వినోద్ భార్గవ్ ఏర్పాట్లు చేశారు.

కనులపండువగా..
బేగంపేట:సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఆదివారం ఘటోత్సవం కనులపండువగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అమ్మవారి ఘటోత్సవ అలంకరణను ప్రారంభించారు. ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి ఏడు గంటలకు కర్భలామైదానంలో ముస్తాబైన అమ్మవారి ఘటం ఊరేగింపుగా తిరిగి మహంకాళి అమ్మవారి దేవాలయానికి చేరుకుంది. ఈ క్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఘటానికి పూజలు నిర్వహించారు. మహంకాళి మాణిక్యాలమ్మ సేవా సమితి ఫ్రెండ్స్ అసోసియేషన్ కటారి మహేశ్ నేతృత్వంలో అమ్మవారికి బోనం సమర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అత్తెల్లి అరుణగౌడ్, మాజీ కార్పొరేటర్లు మల్లి ఖార్జున్‌గౌడ్, కిరణ్మయి కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు
అమీర్‌పేట్: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవానికి పెద్దపీట వేసిన ఘనత టీఆర్‌ఎస్ సర్కార్‌దేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. సోమవారం నుంచి ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పెద్దసంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తున్న ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివిధ విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. దాదాపు లక్ష మంది భక్తులు తరలివస్తారని భావిస్తున్న ఎల్లమ్మ కల్యాణానికి పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇద్దరు ఏసీపీలు, 15 మంది ఇన్‌స్పెక్టర్లు, 200 మంది కానిస్టేబుళ్లు, రెండు మహిళా ప్లాటూన్ల సిబ్బంది ఈ వేడుకల భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తాయని పోలీస్ అధికారులు మంత్రి తలసానికి వివరించారు. అంతేకాకుండా పెద్దసంఖ్యలో తరలివస్తున్న భక్తులకు అసౌకర్యం కలుగకుండా బారికేడ్ల నిర్మాణాలు, ఆరోగ్య పరంగా అత్యవసర పరిస్థితులు ఎదురైతే అందుబాటులో వైద్య బృందాలు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, పారిశుధ్య, మురుగునీటి సమస్యలు తలెత్తకుండా జలమండలి, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారని దేవాలయ ఈవో ఎంవీ శర్మ మంత్రి తలసానికి వివరించారు. మంత్రి తలసాని వెంట అమీర్‌పేట్ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి తదితరులు ఉన్నారు.

ఉప్పొంగిన భక్తిభావం
అబిడ్స్ : గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని ధూల్‌పేట ప్రాంతంలో లోధ్‌లు బోనాల(భగీచే) ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. గంగాబౌలిలోని పహాడ్ వాలి మాతా ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. లోధ్ క్షత్రియ సదర్ పంచాయతీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, మంగళ్‌హాట్ కార్పొరేటర్ పరమేశ్వరీసింగ్, గోషామహల్ కార్పొరేటర్ ముఖేశ్‌సింగ్ పాల్గొని బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోధ్ క్షత్రియ సదర్ పంచాయతీ కమిటీ ప్రతినిధులు వారిని ఘనంగా సన్మానించారు. లోధ్ యువకులు నిర్వహించిన ఫలహారం బండికి మంగళ్‌హాట్ కార్పొరేటర్ పరమేశ్వరీసింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు రాకేశ్‌సింగ్, శశిరాజ్‌సింగ్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...