విదేశీ భాషల కోర్సులతో ఉపాధి


Mon,July 8, 2019 12:06 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఇఫ్లూ(ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ).. విదేశీ విద్యకే కాదు.. విదేశాల్లో ఉద్యోగాలు కల్పించడంలోనూ కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. పలు విదేశీ భాషలతో పాటు ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు అందించే వర్సిటీగా నిలుస్తోంది. ఈ వర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్(యూజీ) మొదలు.. పీహెచ్‌డీ వరకు విభిన్న కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏటా హైదరాబాద్ క్యాంపస్‌తో పాటు లక్నో, షిల్లాంగ్‌లో ఇఫ్లూ కేంద్రాల్లో అడ్మిషన్లను ప్రవేశ పరీక్షల ద్వారా చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ ముగిసి.. త్వరలో తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇఫ్లూ అందించే పలు కోర్సుల ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం విదేశాలకు వెళ్లేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయి. ఈ వర్సిటీలో విదేశీ కోర్సులను పూర్తి చేసిన కొద్ది రోజుల్లోనే మంచి ఉద్యోగావకాశాలను సొంతం చేసుకుంటుండడం గమనార్హం.

విదేశాలకు వెళ్లేందుకు ప్రాంతీయ భాషలు..
ఇఫ్లూ ప్రధాన కేంద్రం హైదరాబాద్‌లో ఉంది. ఇందులో చేరేందుకు తెలుగు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులతో పాటు ఇతర రాష్ర్టాలు, దేశాల నుంచి అభ్యర్థులు రావడం విశేషం. ఇంజనీరింగ్, మెడిసిన్, న్యాయ విద్య వంటి వివిధ కోర్సులు పూర్తి చేసిన వారు కూడా విదేశాలకు వెళ్లేందుకు ఆయా దేశాల ప్రాంతీయ భాషలను నేర్చుకుంటున్నారు. ఇందుకోసం ఇఫ్లూని ఆశ్రయిస్తున్నారు. ఆయా దేశాల్లో అవసరమైన స్థానిక భాషల్లో కనీస అవగాహన ఉంటేనే.. అక్కడ రాణించడానికి అవకాశం ఉంటుందని వారి భావన. ఇఫ్లూలో కోర్సులు చేస్తున్న చాలామంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఇఫ్లూ అందించే పలు కోర్సులు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విదేశాలకు వెళ్లేందుకు ఎన్నో అపార అవకాశౠలను తెచ్చిపెడుతోంది. వర్సిటీలో బీఏ(ఆనర్స్) ఇంగ్లీష్‌తో పాటు బీఏ(ఆనర్స్) అరబిక్, జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్ కోర్సులతో పాటు బీఏ(జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్) కోర్సులు యూజీ స్థాయిలో అందిస్తున్నారు. పీజీ స్థాయిలో ఎంఏ(ఇంగ్లీష్), ఎంఏ(ఇంగ్లీష్ లిటరేచర్)లతో పాటు ఎంఏ( జేఎంసీ), ఎంఏ(లింగ్విస్టిక్స్), బీఎడ్(ఇంగ్లీష్), పీజీడీటీఈ(ఇంగ్లీష్), పీజీడీటీఈ(అరబిక్), కంపారిటివ్ లిటరేచర్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, హిందీ, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, అరబిక్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ తదితర కోర్సులు అందిస్తున్నారు.

అత్యుత్తమ బోధన..
వివిధ కోర్సులు చేస్తోన్న విద్యార్థులు సుమారు 4500 మంది విశ్వవిద్యాలయంలో ఉన్నారు. బోధనలోనూ అత్యాధునిక విధానాలను అనుసరిస్తున్నాం. డిజిటల్ తరగతులు, ఆధునిక పరికరాలతో కూడిన ల్యాబ్‌లు, చర్చాగోష్ఠులు ఉంటాయి. విదేశీ భాషపై పట్టు దక్కించుకునేందుకు అవకాశం ఉన్న అన్ని విధానాలను వర్సిటీలో అమలులోకి తీసుకొస్తున్నాం. ఇఫ్లూలో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటున్నాయి. దీంతో ఏటా ధరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...