సికింద్రాబాద్ మడ్‌ఫోర్ట్‌లో మోడ్రన్ చాకిరేవు..


Mon,July 8, 2019 12:05 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రజకుల సౌకర్యార్థం ఇప్పుడు అత్యాధునిక చాకిరేవులు జిల్లాలో అందుబాటులోకి రాబోతున్నాయి. సికింద్రాబాద్ మడ్‌ఫోర్ట్‌లో అత్యాధునిక యాంత్రిక దోబీఘాట్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే భవన నిర్మాణం పూర్తికాగా, మోడ్రన్ యంత్రసామగ్రిని తెప్పించి దోబీఘాట్‌ను సిద్ధం చేయబోతున్నారు. కాలక్రమేనా వచ్చిన సామాజిక మార్పుతో ఒకప్పటి చాకి బండలు కనుమరుగుకాగా.. చెరువులు మాయమయ్యాయి. డిజర్జెంట్లు, సబ్బులు, సర్ఫ్‌లు, బట్టలుతికే యంత్రా లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రజకులకు కష్టాలు వచ్చిపడ్డాయి. బట్టలుతికే క్రమంలో సోడాను వాడటంతో రజకుల చేతులు, కాళ్లు పగలడం జరుగుతున్నది. ఇక దవాఖాన్లు, అపరిశుభ్రమైన బట్టలను ఉతికే క్రమంలో రజకులంతా అనారోగ్యం పాలవుతున్నారు. ఇక గ్రేటర్‌లో ఉన్న చెరువుల్లోని నీళ్లన్నీ కలుషితమయ్యాయి. ఉన్న చిన్నపాటి చెరువులు కుంచించుకుపోవడంతో నీళ్లు దొరకడం కష్టతరమవుతున్నది. మరీ ముఖ్యం గా గ్రేటర్ హైదరాబాద్‌లోని చెరువులన్నీ గృహసంబంధ వ్యర్థజలాలు, రసాయన వ్యర్థజలాలు కలవడంతో కాలుష్య కాసారారాలుగా మారిపోయాయి. దీంతో చెరువుల్లో బట్టలుతకడానికి చెరువుల్లోని నీటిని ఉపయోగించుకోలేని పరిస్థితులు వచ్చిపడ్డాయి. దీంతో రజకులకు కష్టాలు మొదలయ్యాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం మెడ్రల్ మెకనైడ్జ్ దోబిఘాట్లను నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది.
మూడు పనులు ఒకే చోట..
బట్టలను ఉతకడం, ఆరబెట్టడం, ఇస్త్రీ చేసి ఇవ్వడం లాంటి మూడు పనులను ఒకే చోట, అది యంత్రసామగ్రి సహకారంతో చేసేలా ఈ దోబీఘాట్లను నిర్మిస్తున్నారు. గంట సేపట్లో 90 కేజీల బట్టలను శుభ్రంచేసి, ఇస్త్రీ చేసేటువంటి సామర్థ్యం గల యంత్రసాయగ్రిని దోబీఘాట్ల కోసం తెప్పిస్తున్నారు. మొత్తంగా రూ. 57 లక్షల వ్యయంతో ఈ దోబీఘాట్ నిర్మాణానికి ప్రతిపాధనలు సిద్ధం చేయగా, బీసీ సంక్షేమశాఖ అధికారులు ఆమో దం తెలిపారు. దీంట్లో రూ. 27లక్షలు భవన నిర్మాణానికి, మరో రూ. 30, 45, 480లను యంత్రసామగ్రి కొనుగోలుకు వెచ్చిస్తున్నారు. భవనం నిర్మాణం ఇప్పటికే పూర్తికాగా, యంత్ర సామగ్రి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్ కన్నన్‌కు ప్రతిపాధనలు పంపించారు. ఆన్‌లైన్ ఓపెన్ టెండర్లు ఆహ్వానించి యంత్రసామగ్రిని కొనుగోలు చేయాలని ఆదేశించారు. దీంతో ఆన్‌లైన్ బిడ్లు ఆహ్వానించేందుకు బీసీ సంక్షేమశాఖాధికారులు కసరత్తును చేస్తున్నారు.

మరో 39 దోబీఘాట్లకు గ్రాంట్..
జిల్లాలో రజకుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో దోబీఘాట్లను నిర్మించేందుకు గాను బీసీ సంక్షేమశాఖ గ్రాంట్ ఇన్ ఏయిడ్‌ను మంజూరు చేస్తున్నది. ఇలా జిల్లాలో 39 దోబీఘాట్ల నిర్మాణానికి నిధులను కేటాయించింది. మొత్తంగా రూ. 1.55 కోట్ల నిధులను ఆశాఖ మంజూరు చేసింది. వీటిలో 14 దోబీఘాట్ల నిర్మాణం పూర్తికాగా, మరో 15 దోబీఘాట్ల నిర్మా ణం పురోగతిలో ఉండగా, పలు కారణాలతో 9 దోబీఘాట్ల నిర్మాణం ఇంత వరకు ప్రారంభం కాలేదు. ఇక దోబీఘాట్లుగా ప్రకటించి, ఖాళీగా ఉన్న స్థలాల్లో మరికొన్నింటికి ఆర్‌సీ స్లాబులు నిర్మించడానికి సైతం ఆశాఖ అధికారులు అనుమతులు జారీచేశారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...