దివ్యాంగుల ఉద్యోగ మేళాకు విశేష స్పందన


Thu,June 20, 2019 12:33 AM

- రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన 340 మంది దివ్యాంగ నిరుద్యోగులు
- 151 మందిని ఎంపిక చేసుకున్న బహుళజాతి సంస్థలు
-ఉపాధి కల్పించేందుకే ఉద్యోగ మేళాలు : కమిషనర్ ఎండీ శైలజ
మలక్‌పేట : మలక్‌పేట నల్గొండ చౌరస్తాలోని వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఉద్యోగ మేళాకు విశేష స్పందన లభించింది. వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ కమిషనర్ ఎండీ శైలజ ఆదేశాల మేరకు పదవ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హతలు గల నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 340 మంది నిరుద్యోగ దివ్యాంగులు తరలివచ్చారు. నగరంలోని విభిన్న రంగాలకు చెందిన పలు బహుళజాతి సంస్థలు గూగుల్, యాక్సెంచర్, ఏజీఎస్, సీటెల్, జెన్‌ప్యాక్ట్, కాగ్నిజెంట్, హెచ్‌జీఎస్, మెక్ డొనాల్డ్స్, రిలియన్స్ రిటైల్, నెక్సా, జయభేరి, ఆల్ఫా ఇండస్ట్రీస్, మెట్రో కోచ్ అండ్ క్యారీ, కంపాస్ గ్రూప్, మ్యాప్రె, ఈ వింధ్య, కెఎఫ్‌సీ, డీమార్ట్, ఫ్యూచర్ గ్రూప్, గార్లే గ్రూప్, రియల్ పేజ్, సత్యసాయి ట్రాన్స్‌పోర్టు, కన్వర్స్ ప్లేస్‌మెంట్ సర్వీసెస్ తదితర 23 సంస్థలకు చెందిన ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన 151 మంది నిరుద్యోగులను ఎంపిక చేసుకున్నారు.

ఎంపికైన వారికి జాయినింగ్‌కు సంబంధించి కాల్ లెటర్లను త్వరలో పంపిస్తామని సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ కమిషనర్ ఎండీ శైలజ మాట్లాడుతూ దివ్యాంగ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు వికలాంగుల సంక్షేమశాఖ కార్యాలయంలో ఉద్యోగ మేళాలు నిర్వహించడం జరుతుందని తెలిపారు. ఇప్పటి వరకు మూడుసార్లు ఉద్యోగ మేళాలు నిర్వహించామని, ఇది నాలుగవదని, అందులో ఒకటి వరంగల్ నగరంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. దివ్యాంగుల్లో విద్యావంతుల సంఖ్య పెరుగుతున్నందున వారికి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి రెండు, మూడు నెలలకోసారి ఉద్యోగ మేళాలు నిర్వహించి దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. దివ్యాంగుల అభివృద్ధికి సంక్షేమశాఖ విశేష కృషి చేస్తుందని, వారి సంక్షేమానికి అనేక రకాల కొత్త పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగ నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన బహుళ జాతి సంస్థల ప్రతినిధులకు కమిషనర్ శైలజ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమశాఖ రిహాబిలిటేషన్ కన్సల్టెంట్ డాక్టర్‌‌ర పవీణ్‌కుమార్, డిజేబుల్డ్ ప్రోగ్రాం అండ్ రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ జయంతిసాగర్, సిబ్బంది సుభాష్, రాంగోపాల్, ఇంటర్మ్స్ మదన్, వినీత్, చైతన్య, జ్యోత్స్న పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...