ఎంత అంత డబ్బు


Wed,June 19, 2019 01:02 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరీంనగర్‌కు చెందిన ఓ కుటుంబం పనిమీద నగరంలోని తమ బంధువుల ఇంటికి వచ్చింది. సమయం రాత్రి 11:40గంటలు. ఎలాంటి సమాచారం లేకుండా రావటంతో ఆ ఇంటివారు వంట ఎలా సిద్ధం చేయాలో ఆలోచిస్తున్నారు. ఇంతలోనే ఇంటి బయట నుంచి ఎవరిదో పిలుపు. వెళ్లి చూడగా.. ఘుమఘుమలాడుతున్న.. వేడివేడి వంటకాలతో ఓ వ్యక్తి కనిపించాడు. “మేడం నేను ఫుడ్‌ డెలివరీ బాయ్‌ని. 15 నిమిషాల క్రితం ఆర్డర్‌ వచ్చింది. ఇదిగోండి.. మీరు కోరిన వంటకాలు” అంటూ అందించి వెళ్లిపోయాడు. తన కుమారుడు ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన విషయం తెలుసుకుని సంతోషించింది. గ్రేటర్‌లో ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ తమ సేవలతో ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. స్విగ్గీ, జొమాటో, ఉబర్‌ ఈట్స్‌, ఫుడ్‌పాండా తదితర ఆహార సరఫరా సంస్థలు ఆన్‌లైన్‌లో తమ మార్కెట్‌ను విస్తరించుకుంటున్నాయి. ఈ క్రమంలో డెలివరీ బాయ్స్‌ను పెద్ద ఎత్తున రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. గ్రేటర్‌లో సుమారు 30వేలకుపైగా డెలివరీ బాయ్స్‌ సేవలందిస్తున్నారు. ఒక డెలవరీ బాయ్‌ రోజుకు ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఆర్జిస్తున్నారు.

ఒక్కో సంస్థలో ఒక్కో విధంగా చెల్లింపులు..
ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌కు కంపెనీ ఎలాంటి జీతం ఇవ్వదు. అయితే కచ్చితంగా ఆర్డర్స్‌ వస్తాయని డెలివరీ బాయ్స్‌ చెబుతున్నారు. జొమాటోలో ఒక ఆర్డర్‌ మీద 40 రూపాయలు వస్తాయని అంటున్నారు. అందులో కస్టమర్‌ డెలివరీకి 20 రూపాయలు, రెస్టారెంట్‌లో వెయిటింగ్‌కు 20 రూపాయలు మొత్తంగా 40 రూపాయలు వస్తాయని చెబుతున్నారు. ఒక రోజుకు కనీసం 14 ఆర్డర్స్‌ చేసుకుంటారు. అంతేకాదు 14 ఆర్డర్స్‌ పూర్తి చేసుకుంటే అదనంగా 300 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఒకవేళ 20 ఆర్డర్లు చేసుకుంటే 450 రూపాయలు, 25కిపైగా ఆర్డర్లు చేస్తే 700 రూపాయలు ఇన్సెంటివ్స్‌ వస్తాయి. అంతేకాదు 6 కిమీల దూరం దాటితే.. కిలోమీటర్‌కు పది రూపాయలు కంపెనీ చెల్లిస్తుంది. పది కిలో మీటర్ల దూరం దాటితే.. ఆపై కిలోమీటర్‌కి రూ.15 కంపెనీ చెల్లిస్తుంది. మరో ఆన్‌లైన్‌ ఫుడ్‌ సైప్లె సంస్థ స్విగ్గీలో ఒక ఆర్డర్‌పై రూ.35 వరకు వస్తుంది. ఇందులో రూ.900 వరకు బిజినెస్‌ చేస్తే అదనంగా 200 రూపాయ వరకూ వస్తాయి. స్విగ్గీలో రోజూ విధులలో లాగిన్‌ అయి ఉంటే రూ.500 చెల్లిస్తామని స్విగీ ఫ్లీడ్‌ మేనేజర్‌ అలీ తెలిపారు. ఆర్డర్‌ కోసం రెస్టారెంట్‌ వద్ద ఫుడ్‌ ప్రిపేర్‌ ఆలస్యానికి ప్రతి నిమిషానికి ఒక్క రూపాయి చొప్పున డెలివరీ బాయ్స్‌ పొందుతున్నారని అన్నారు. ఉబర్‌ ఈట్స్‌ ఒక్క ఆర్డర్‌ మీద డెలివరీ బాయ్స్‌కి రూ 35 చెల్లిస్తున్నది. ఇందులో 24 ఆర్డర్లు చేసుకుంటే అదనంగా 600 రూపాయలు గడించొచ్చని డెలివరీ బాయ్స్‌ తెలిపారు. నెలకు సుమారు 15 వేల నుంచి 30 వేల మధ్య సంపాదించుకోవచ్చని డెలివరీ బాయ్స్‌ పేర్కొంటున్నారు.
ఈ ప్రాంతాల్లో ఆర్డర్లు ఎక్కువ..
బంజారాహిల్స్‌, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి పరిధి ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీకి గిరాకీ పెరిగింది. ఈ ప్రాంతాల్లో పనిచేసే డెలివరీ బాయ్‌ రోజుకు రెండు వేల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉందని చెప్పారు.
. ట్రాఫిక్‌లోనూ..
మహానగరంలో ట్రాఫిక్‌ కష్టాల గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటి స్థితిలో ఫుడ్‌.. సమయానికి అందివ్వాలంటే కత్తిమీద సామే. సమయానికి ఆర్డర్‌ అందించకపోతే కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అంతేకాదు ఆలస్యం అయితే ఇన్సెంటివ్స్‌ పొందడం కూడా కుదరదు. అందుకే ఫుడ్‌ సైప్లె బాయ్స్‌ ఎక్కువగా షార్ట్‌కట్‌ దారులను ఎంచుకుంటున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలను పాటించడం లేదు. పోలీసులకు పట్టుబడి సంపాదించిన డబ్బులు చలాన్లకే కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికి ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి ప్రమాదాలు జరుగకుండా చూడాల్సిందే.
పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ..
డెలివరీ బాయ్స్‌గా!
డిగ్రీలు, పీజీలు చేసిన వారు సైతం ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌గా అవతారమెత్తుతున్నారు. పలు జిల్లాల నుంచి వచ్చి అద్దె ఇండ్లలో ఉంటూ పోటీ పరీక్షలకు నన్నద్ధమవుతూనే.. పార్ట్‌టైం, ఫుల్‌టైం పనులు చేసుకుంటున్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...