తడి పొడి టన్నుల్లో అమ్మేసిబూడిద సుధాకర్‌


Wed,June 19, 2019 01:02 AM

మేడ్చల్‌ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : రోజురోజుకు జటిలంగా మారుతున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. పట్టణాలతో పాటు మారు మూల పల్లెల్లో సైతం చెత్త తరలింపు సవాల్‌లా మారింది. ముఖ్యంగా నగర శివారులోని మేడ్చల్‌ జిల్లా పరిధిలోని గ్రామాలు అభివృద్ధిలో నగరంతో పోటీ పడుతున్నప్పటికీ పారిశుధ్య నిర్వహణలో మాత్రం అధ్వాన పరిస్థితి. అయితే ఇక నుంచి పల్లెల్లో ఈ చెత్త దుస్థితి మారనున్నది. ఇన్నాళ్లు చెత్త తీసుకెళ్లే నాథుడే లేని పల్లెల్లో ఇక నుంచి ఏరికోరి కిలోల లెక్క కొనుగోలు చేయనున్నారు. గ్రీన్‌ టిబ్యునల్‌ ఆదేశాలు, జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి చొరవ, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్‌ పర్యవేక్షణలో ఇక నుంచి మేడ్చల్‌ జిల్లా పరిధిలోని 61 గ్రామాల్లో 21 క్లస్టర్ల ద్వారా ప్రయోగాత్మకంగా ఓ ఏజెన్సీ చెత్తను కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించిన కసరత్తు దాదాపుగా పూర్తి కావచ్చింది. మరికొద్ది రోజుల్లోనే మేడ్చల్‌ జిల్లా పల్లెల్లో చెత్త సమస్యకు శాశ్వత విముక్తి లభిచనున్నది. ఇందులో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్‌ జిల్లా పరిధిలోని ఈవోపీఆర్డీలతో, ఏజెన్సీ ప్రతినిధులతో కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సమావేశం నిర్వహించి అధికారులకు, ఏజెన్సీ ప్రతినిధులకు దిశానిర్ధేశం చేశారు.

61 గ్రామాలు 21 క్లస్టర్లు..
జిల్లా పరిధిలోని మొత్తం 61 గ్రామాలుండగా, వీటిని 21 క్లస్టర్లుగా (మేడ్చల్‌లో-6, ఘట్‌కేసర్‌లో-4, శామీర్‌పేట్‌లో-4 కీసరలో-3, మూడుచింతలపల్లిలో-4) క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ముందస్తుగా ప్రతి ఇంటికి తడి చెత్తను వేసేందుకు ఓ డస్ట్‌బిన్‌ను, పొడి చెత్తను వేసేందుకు ఓ బ్యాగును గ్రామంలోని ప్రతి ఇంటికి ఉచితంగా ఇవ్వనున్నారు. అనంతరం ప్రతి ఇంటి నుంచి పంచాయతీ సిబ్బంది ద్వారా గ్రామం మొత్తంలో సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డుకు కాకుండా నేరుగా ఓ ట్రాక్టర్‌, చెత్త తరలింపు వాహనం ద్వారా సమీపంలోని క్లస్టర్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి జిల్లాలో సుమారు 5-6 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న చెత్త సేకరణ కేంద్రం (షెడ్డు)కు తరలించి అక్కడ తడి, పొడి చెత్తను, ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేరు చేసి ఏజెన్సీకి సంబంధించిన చర్లపల్లి పారిశ్రామిక వాడలోని పరిశ్రమకు ఏ రోజుకు ఆరోజు తరలించి తడి చెత్తను రీసైక్లింగ్‌ చేసి సేంద్రియ ఎరువులుగా, విద్యుత్‌ ఉత్పత్తికి, పొడి చెత్తను సిమెంట్‌ పరిశ్రమలకు, ప్లాస్టిక్‌ ఉత్పత్తుల పరిశ్రమలకు తరలించనున్నారు.

చెత్తకూ ఓ లెక్కుంది..
ప్రతి గ్రామంలో సేకరించిన చెత్తను క్లస్టర్‌కు తరలించే సమయంలో తూకం వేస్తారు. ఇందులో తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా తూకం వేసి ఏ పంచాయతీలో ఎంత చెత్తను సేకరించిన విక్రయించారో ఏజెన్సీ ప్రతినిధులతో పాటు పంచాయతీ సిబ్బంది లెక్క రాయనున్నారు. ఇలా ప్రతిరోజు సేకరించిన చెత్తను టన్నుల్లో ఏజెన్సీకి విక్రయించి ప్రతి నెల ఏజెన్సీ నుంచి చెత్త ద్వారా వచ్చిన డబ్బులను గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేయనున్నారు. ఈ చెత్త ద్వారా వచ్చిన నిధులను చెత్త సేకరణలో, క్లస్టర్లలో తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు నియమించిన సిబ్బందికి వేతనాలను ఇవ్వడంతో పాటు గ్రామాభివృద్ధి పనుల కోసం వెచ్చిస్తామని జిల్లా పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు.

తగ్గనున్న కాలుష్యం..
ప్రస్తుతం గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది సేకరించిన చెత్తను గ్రామ శివారులో ఏర్పాటు చేసిన గ్రామ డంపింగ్‌ యార్డులో వేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా నిండగానే ఆ చెత్తకు నిప్పు పెట్టి తగులబెడుతున్నారు. దీంతో ప్రతి రోజు చెత్త నుంచి వెలువడే దుర్గంధంతో పాటు పొగతో ఏర్పడుతున్న వాయు కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక నుంచి గ్రామ ప్రజలకు ఇలాంటి ఇబ్బందులుండవని, గ్రామాల్లో వాయుకాలుష్యం పూర్తిగా తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గాలిదుమారం వచ్చినప్పుడు డంపింగ్‌ యార్డుల్లోని చెత్త వచ్చి రోడ్డుపై, ఇండ్లముంగిట పడుతుండటంతో పారిశుధ్య సమస్యలు నిత్యకృత్యమయ్యాయి. ఇక నుంచి గ్రామంలో చెత్తను ఏ రోజుకారోజు తరలిస్తుండటంతో అసలు గ్రామంలో చెత్త సమస్యే ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...