విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొంటాం..


Tue,June 18, 2019 04:03 AM

ఖైరతాబాద్‌ / సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మరికొన్ని రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తుతుందో తెలియని పరిస్థితి.. ఓ వైపు వరదలు ఏరులై పారుతుంటే.. మరోవైపు చెట్లు, శిథిల భవనాలు కూలిపోయే ప్రమాదం..వాహనాలు కిలో మీటర్ల మేర నిలిచి ఉండే అవకాశం. ఈలాంటి విపత్కర పరిస్థితుల్లో నగరవాసి ఎంత తల్లడిల్లుతాడో అందరికీ అనుభవమే. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ప్రకృతి కోపంతో ఎక్క డో అక్కడ సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి. అయితే ఈ సారి ఎలాంటి విపత్తులు ఎదురైనా.. తక్షణమే రంగంలోకి దిగి నివారించేలా జీహెచ్‌ఎంసీ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించింది. అందులో భాగంగానే నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్‌ప్లాజాలో సోమవారం వివిధ శాఖలకు చెందిన మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ టీంలను జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ.. నగరంలో ఎలాంటి విపత్తులు సంభవించినా సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రేటర్‌లో జూన్‌ 15 నుంచి ఆగస్టు 15 వరకు హోర్డింగ్స్‌, యూనిపోల్స్‌పై నిషేధం విధించామని వివరించారు. వర్షాల కారణంగా తలెత్తే విపత్తులను ఎదుర్కొనేందుకు 493 డిజాస్టర్‌ రెస్పాన్స్‌ టీంలు సిద్ధంగా ఉన్నాయని, అన్ని విభాగాల అధికారులు కోఆర్డినేషన్‌తో పనిచేయాలని సూచించారు. ఎక్కడ ఎంత వర్షం పడితే ముంపు వస్తుందో పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే 195 నీటి ముంపు ప్రాంతాలుగా గుర్తించామని, అక్కడ చర్యలు చేపట్టామని వివరించారు. ఎమర్జెన్సీ టీంలు టెక్నాలజీ ఉపయోగించి చర్యలు చేపడుతారని, ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో కూడా జీపీఎస్‌తో తెలిసిపోతుందని మేయర్‌ పేర్కొన్నారు. ఆయా డిపార్ట్‌మెంట్స్‌ అధికారులు వారి డ్రెస్‌కోడ్‌ ధరించాలని, దీంతో ఏ డిపార్ట్‌మెంట్‌ వారు ఎక్కడ పనిచేస్తున్నారో సులభంగా తెలిసిపోతుందని సూచించారు. గతంలో ఎదుర్కొన్న సమస్యలను ఈ సారి పునారవృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నామన్నారు. 600 శిథిల భవనాలను ఇప్పటికే కూల్చివేశామని తెలిపారు.

అనంతరం డిప్యూటీ మేయర్‌ ఫసియుద్దీన్‌ మాట్లాడుతూ.. విపత్తులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా పనిచేయాలన్నారు. గ్రేటర్‌లోని 150 వార్డులలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే తాగునీరు, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడానికి స్థానిక కమ్యూనిటీ హాళ్లు, పాఠశాలలను గుర్తించామని తెలిపారు. విపత్తుల నివారణ, సంబంధిత అంశాలపై నగరంలోని కార్పొరేటర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌, జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి, పోలీసు, ట్రాఫిక్‌, మెట్రోరైలు, హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, విద్యుత్‌ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...