ఇష్టారాజ్యంగా ఫీజుల పెంపు..


Mon,June 17, 2019 03:45 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. స్కూల్స్ మొదలవడానికి 10రోజుల ముందు నుంచే ఫస్ట్ టర్మ్ ఫీజు చెల్లించాలంటూ.. ఆయా పాఠశాలల యాజమాన్యాల నుంచి తల్లిదండ్రులకు ఫోన్లు, సందేశాలు. ఇక పాఠశాలలు ప్రారంభమయ్యేది తడవుగా యుద్ధ ప్రాతిపదికన ఫీజు చెల్లించడంతో పాటు పుస్తకాలు, నోట్ బుక్స్, దుస్తు లు, షూస్ తీసుకోవాలంటూ యాజమానాల్యల హుకుం. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో తల్లిదండ్రులు పిల్లలకు అవసరమైన పుస్తకాలు, యూ నిఫామ్స్, ఇతర వస్తువుల కొనుగోలుపై దృష్టి సారించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమ ఫీజు లను విచ్చలవిడిగా పెంచాయి. ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవో నంబర్ 42ను తుంగలో తొక్కి.. ఖర్చులు పెరుగుతున్నాయన్న సాకుతో గతేడాది కంటే 10 నుంచి 20 శాతం ఫీజులను పెంచారు. ఓ మోస్తరు స్థాయి స్కూల్ లో నర్సరీకి రూ.25 వేలు, ఎల్‌కేజీ, యూకేజీలకు రూ.40వేలు వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్యులకు ప్రైవేటు విద్య అందని ద్రాక్షలా మారింది.
నగరంలో 3వేల వరకు ప్రైవేటు పాఠశాలలున్నాయి. వీటిల్లో లక్షలాది మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే ఫీజుల విషయంలో రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన ఆదేశాలను పాఠశాలలు ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారీతిన పెంచేశారు. పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి, ఫీజులను నిర్ణయించాల్సి ఉండగా, ఖర్చులు పెరుగుతున్నాయన్న సాకుతో ఫీజులను యథేచ్చగా పెంచుతున్నారు. ప్రతి పాఠశాలలో ఫీజులకు సంబంధించిన బోర్డులు ఏర్పా టు చేయాల్సి ఉన్నా.. ఈ నిబంధనలను ఏ పాఠశాల యాజమాన్యామూ పాటించడం లేదు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకే నగరంలో రూ.25వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవొచ్చు. గల్లీలో ఉండే పాఠశాలలు మొదలు.. కార్పొరేట్ పాఠశాలల వరకు ఇదే దోపిడీ కొనసాగుతుండడం గమనార్హం.

పుస్తకాలు, యూనిఫామ్స్‌లో పర్సంటేజీ..
ఫీజుల దోపిడీ పక్కన బెడితే విద్యార్థులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, ఇతర సామగ్రిపేరుతో ప్రైవేటు పాఠశాలలు మ రింత దోపిడీకి పాల్పడుతున్నాయి. పుస్తకాలు, యూనిఫాంలు తమ పాఠశాలల్లోనే విద్యార్థులు తీసుకునేలా ప్రణాళికలతో ప్రైవేటు పాఠశాలలు తమ విద్యా వ్యాపారాన్ని మొదలుపెట్టాయి. తమ పాఠశాలల్లో ఇచ్చే పుస్తకాలు, నోట్ పుస్తకాలు బయట ఎక్కడా దొరకవంటూ విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకే రూ.4వేల నుంచి రూ.6వేల వరకు పుస్తకాలు, యూనిఫామ్స్ పేరుతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫామ్స్ విక్రయించొద్దనే నిబంధనలున్నా.. వాటిని యాజమాన్యాలు యథేచ్చగా అతిక్రమిస్తున్నాయి.

పట్టించుకోని విద్యాశాఖ
నగరంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచి.. పుస్తకాలు, యూనిఫామ్స్ పురుతో అదనపు డబ్బులు వసూలు చేస్తునాన.. విద్యాశాఖాధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి ఫీజులను నిర్ణయించాల్సి ఉండగా, పాఠశాలలు ప్రారంభం కాకముందు నుంచే యాజమాన్యాలు ఫీజులను నిర్ణయించాయి. తనిఖీలు చేసి ఫీజులు నియంత్రించాల్సిన విద్యాశాఖాధికారులు మాత్రం తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయి విద్యాశాఖ అధికారులు సైతం ప్రైవేటు పాఠశాలల వైపు చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...