‘బాయ్స్‌'.. రూల్స్‌ పాటించాల్సిందే


Sun,June 16, 2019 02:09 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నిర్ధేశించిన సమయం కంటే మూడు నాలుగు నిమిషాల ముందే ఫుడ్‌ డెలివరీ చేయాలి.. అది పూర్తవగానే మరో డెలివరీ ఆర్డర్‌ వచ్చేయాలి.. ఫీడ్‌ బ్యాక్‌ ఎక్స్‌లెంట్‌ అని రావాలి..నిన్నటి కంటే ఎక్కువగా ఈ రోజు కమీషన్లు రాబట్టాలనే ఉద్దేశంతో ఆన్‌ ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ భారీగా ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. దీని ద్వారా రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతున్నది.. ట్రై కమిషనరేట్ల పరిధిలో ఎక్కువగా ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ పాల్పడుతున్నారు. ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులపై ట్రాఫిక్‌ పోలీసుల మూడో నేత్రం పనిచేస్తున్నా.. ఆ కెమెరా కంటికి చిక్కకుండా తమ నంబర్‌ ప్లేట్లు కన్పించకుండా చేస్తూ దూసుకుపోతున్నారు. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ మొబైల్‌ యాప్‌లు స్విగ్గీ, జుమాటో, ఉబర్‌ ఈట్స్‌, ఫుడ్‌ పండా తదితర మొబైల్‌ యాప్‌లతో పాటు ఆయా హోటళ్లు నేరుగా ఆన్‌లైన్‌లో ఫుడ్‌ డెలివరీ చేస్తుంటాయి. ఇలా ఆన్‌లైన్‌ యాప్‌లకు సేవలందిస్తున్న వారి సంఖ్య ట్రై కమిషనరేట్ల పరిధిలో 50 వేలకుపైగా ఉంటుంది. ప్రతి రోజు ఈ 50 వేల మంది రోడ్లపై ఫుడ్‌ డెలివరీ చేసేందుకు తిరుగుతుంటారు. ఇందులో సగానికి సగం మంది ట్రాఫిక్‌ నిబంధనలు పాటించరు.

వారి రోజు వారి సంపాదనను పెంచుకోవడంపై దృష్టి పెడుతుంటారు. ఎన్ని చోట్లకు ఫుడ్‌ డెలివరీ చేస్తే అన్ని డబ్బులు వారికి వస్తుంటాయి. ఫుడ్‌ డెలివరీలో పూర్తిస్థాయిలో యువతనే ఉంటుంది. దీంతో యువత వాహనం ఎక్కిందంటే వెనుకా ముందు చూడకుండా దూసుకుపోతుంది. దానికి తోడు ఫుడ్‌ డెలివరీ లక్ష్యం వారికి ఉండటంతో ఇక వారిని ఆపేవారే ఉండని పరిస్థితి ఉంటుంది. ఫుడ్‌ డెలివరీ చేసే యువత వాహనాలను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రమాదాలను కొనితెచ్చుకోవడమే కాకుండా.. రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులను కూడా ప్రమాదాల్లోకి నెడుతున్నాయి. దీంతో ట్రై పోలీస్‌ కమిషనరేట్ల ట్రాఫిక్‌ పోలీసులు ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ నిబంధనలు పాటించే విధంగా చేయడంలో.. ఆయా నిర్వాహణ సంస్థలు బాధ్యత తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ కార్యాలయంలో అదనపు పోలీస్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ నేతృత్వంలో హైదరాబాద్‌ డీసీపీ చౌహాన్‌, సైబరాబాద్‌ డీసీపీ విజయ్‌కుమార్‌లతో కలిసి ఫుడ్‌ డెలివరీ యాప్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...