మహిళలపై హింసను అరికట్టాలి: జస్టిస్‌ రోహిణి


Sun,June 16, 2019 02:08 AM

ఉస్మానియా యూనివర్సిటీ: మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టకుండా లింగసమానత్వాన్ని సాధించలేమని ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ జి. రోహిణి అన్నారు. మహిళల సమానత్వం, అభివృద్ధి కోసం భారత రాజ్యాంగంలో పేర్కొన్నారని, అనేక చట్టాలు తీసుకువచ్చారని చెప్పారు. అయినా ఇప్పటికీ మహిళలపై ఆకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్‌ బూర్గుల రామకృష్ణారావు ఫౌండేషన్‌ కమిటీ, ఉస్మానియా యూనివర్సిటీ సంయుక్తంగా డాక్టర్‌ బూర్గుల రామకృష్ణారావు స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఓయూలోని పీజీఆర్‌ఆర్‌సీడీఈ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ‘జెండర్‌ ఈక్విటీ.. కాంటెంపరరీ చాలెంజెస్‌'అనే అంశంపై జస్టిస్‌ రోహిణి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు కుటుంబం నుంచి మొదలుకొని కార్యాలయాలు, పనిచేసే స్థలాల్లో మహిళలు శారీరక, మానసిక హింసకు గురవుతున్నారన్నారు.

వివిధ రూపాల్లో మహిళల పట్ల కొనసాగుతున్న హింసను అరికట్టేందుకు సరైన వ్యూహం, కార్యాచరణతో ముందుకు సాగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మహిళల ఆరోగ్యాన్ని కాపాడడంలో నిర్లక్ష్యం జరుగుతోందని, మహిళల ఆరోగ్యం ఒక వైపు వారి కుటుంబానికి, మరోవైపు దేశానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళలకు విద్య, ఆర్థిక స్వాతంత్య్రం మాత్రమే వస్తే మహిళా సాధికారత వచ్చినట్లు అవుతుందా అని ప్రశ్నించారు. కుటుంబ వ్యవహారాల్లో పాలుపంచుకోవడం, ఉపాధి ఎంచుకోవడం, వివాహం, తదితర అంశాల్లో మహిళలకు స్వేచ్ఛ ఉన్నప్పుడే మహిళా సాధికారతకు అర్థం ఉంటుందని వివరించారు. మహిళలకు స్థానిక సంస్థల్లో కేటాయిస్తున్న రిజర్వేషన్ల వల్ల మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక అవుతున్నప్పటికీ వారు కేవలం అలంకారానికే పరిమితమవుతున్నారని.. పురుషులే అధికారాన్ని చెలాయిస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు. హైదరాబాద్‌ రాష్ర్టాన్ని ఇండియన్‌ యూనియన్‌లో కలిపేందుకు బూర్గుల రామకృష్ణారావు పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ బూర్గుల రామకృష్ణారావు ఫౌండేషన్‌ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ బి. బాబూరావువర్మ పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...