సౌండు పెంచొద్దు..


Sat,June 15, 2019 12:41 AM

-80 డెసిబుల్స్‌ దాటితే..వెయ్యి జరిమానా
-మోతాదుకు మించిన శబ్దాల నుంచి నగరవాసులకు విముక్తి కలిగించే ప్రయత్నం
-అత్యాధునిక పరికరాలతోకొరడా ఝుళిపించనున్న సైబరాబాద్‌ పోలీసులు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/శేరిలింగంపల్లి: మాదాపూర్‌, గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లకు శబ్ద మోతాదును కొలిచే పరికరాలను తెచ్చారు. ప్రయోగత్మకంగా ఈ రెండు పోలీస్‌స్టేషన్ల పరిధిలో పరిశీలించిన తరువాత కమిషనరేట్‌లోని మిగతా పీఎస్‌లకు కూడా వీటిని అందుబాటులోకి తెస్తారు. నిబంధనల ప్రకారం 80 డెసిబుల్‌ శబ్దం వరకు అనుమతి ఉంది.అంతకు మించితే ఈ పరికరాలు గుర్తిస్తాయి. అలాంటి వాహనదారులకు రూ. 1000 జరిమానా వేయనున్నారు.

హారన్లు మార్చేస్తున్నారు..

తమ సంతోషం కోసం ఇతరులను ఇబ్బందులకు గురిచేసే వారు చాలామంది ఉన్నారు. ఫ్యాషన్‌ కోసం.. షోరూంల్లో నుంచి వచ్చిన వాహనాలకు మార్పులు చేస్తున్నారు. ఇందులో వాహనం హారన్‌, సైలెన్సర్లను మార్చేస్తున్నారు. దీంతో ఒక్కసారి హారన్‌ మోగిందంటే ఆ వాహనం పరిసరాల్లో ఉండే వారి చెవులకు చిల్లులు పడే విధంగా ఉంటాయి. కొందరు తమ వాహనాల సైలెన్సర్లను పూర్తిగా మార్పులు చేసేస్తున్నారు. దీంతో రోడ్డుపై ఆ ఒక్క వాహనం వెళ్తుండగానే ఇతరులు, ఆ శబ్దంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు ట్రాఫిక్‌ పోలీసులు శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు ఎన్నో రకాల చర్యలు తీసుకున్నారు. అయితే ఆ వాహనం నుంచి ఎంత శబ్దం వస్తుందని సాంకేతికపరంగా గుర్తించే పరికరాలు అందుబాటులో లేవు.

దీంతో సాంకేతికంగా, ఆధారాలతో సహా శబ్దాన్ని గుర్తించి, ఆయా వాహనాదారులపై జరిమానా రాస్తూ, మార్పు తీసుకురావాలని పోలీసులు భావిస్తున్నారు. వాహనాలకు వాడుతున్న వివిధ రకాలైన హారన్లు, సైలెన్సర్లతో ఇతర వాహనాదారుల కర్ణభేరీలపై ప్రభావం పడుతున్నది. రద్దీగా ఉండే సమయంలో ఇలాంటి శబ్ద కాలుష్యంతో తీవ్రమైన ఇబ్బందులను వాహనదారులు ఎదుర్కొంటున్నారు. హంగూ అర్భాటం కోసం భిన్న రకాలైన శబ్దాలు వచ్చే విధంగా అనేక మంది యువత తమ వాహనాలకు హంగులు వేస్తుంటారు. అందుబాటులో వచ్చిన కొత్త పరికరాలతో తనిఖీలు మొదలు పెడితే.. దొరికిపోతామనే భయంతో తమ హారన్లు, లైసెన్స్‌లను సరిచేసుకుంటారని పోలీసులు భావిస్తున్నారు. శబ్ద కాలుష్యం, దాని వల్ల కలిగే అనర్థాల గురించి వివరిస్తూ వాహనదారుల్లో అవగాహన తేవడం వల్ల త్వరగా ధ్వని కాలుష్యాన్ని నగరంలో నివారించేందుకు అవకాశాలుంటాయని పోలీసులు భావిస్తున్నారు. కాగా, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ అదేశాల మేరకు గచ్చిబౌలి ట్రాఫిక్‌ ఎస్‌ఐ రఘు పలువురు వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక యంత్రంతో ట్రాఫిక్‌ పోలీసులు గచ్చిబౌలిలో వాహనాల తనిఖీలు నిర్వహించారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...