బడికి చేరుకోగానే.. మృత్యువు పిలిచింది


Fri,June 14, 2019 12:53 AM

మన్సూరాబాద్/ఎల్బీనగర్, నమస్తే తెలంగాణ : బడులు తెరిచిన రెండో రోజే నగరంలో దారుణం చోటుచేసుకున్నది. పాఠశాలకు చేరుకున్న అరగంటలోనే.. పదో తరగతి విద్యార్థిని ఒకరు బడి ఐదో అంతస్తు నుంచి కిందపడి మరణించింది. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటన వివరాలిలా ఉన్నాయి. హయత్‌నగర్ మండలం మరిపల్లి గ్రామానికి చెందిన నల్ల నర్సింగ్‌రావు, అనురాధ దంపతులు ప్రస్తుతం తట్టిఅన్నారం, హనుమాన్‌నగర్‌లో నివాసముంటున్నారు. నర్సింగ్‌రావు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మూడవ కుమార్తె వీవిక(15) నాగోల్- సాయినగర్ కాలనీలో శ్రీనాగార్జున హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నది. పాఠశాలకు చెందిన బస్సులో గురువారం ఉదయం ఏడున్నర గంటలకు పాఠశాలకు చేరుకున్నది. ఐదవ అంతస్తులో ఉన్న పదవ తరగతి గది 504 రూమ్‌కు వెళ్లింది. సుమారు 7:57 గంటల సమయంలో వీవిక పాఠశాల భవనం పైనుంచి కింద పడిపోయింది. గమనించిన స్థానికులు స్కూల్ సిబ్బందికి తెలియజేశారు. వెంటనే సదరు బాలికను చికిత్స నిమిత్తం ఎల్బీనగర్‌లోని కామినేని దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడిన బాలిక దవాఖానలో చికిత్స పొందుతూ ఉదయం 10 గంటలకు మృతి చెందింది. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. తండ్రి నర్సింగ్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 304(A) ఐపీసీ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

శోకసంద్రంలో కుటుంబం
వీవిక మృతి ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచిం ది. ఉదయాన్నే స్కూల్‌కు బయలుదేరిన గంటలోపే విగతజీవిగా మారిన వీవిక మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, అక్కలు, తమ్ముడు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. వీవిక మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

చర్యలు తీసుకోవాలని ఆందోళన
వీవిక మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ ఏఐఎస్‌ఎఫ్, ఎమ్మార్పీఎస్, టీఆర్‌ఎస్‌వీ నాయకులు ఆందోళనకు దిగారు. ఫీజులు వసూలు చేసేటప్పుడు ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాగార్జున హైస్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌వీ రంగారెడ్డి జిల్లా తూర్పు విభాగం మాజీ అధ్యక్షుడు వీరమళ్ల రాంనర్సింహాగౌడ్, నాయకులు రాంకోటి పాల్గొన్నారు.

పాఠశాలల్లో రక్షణపై దృష్టి సారించాలి
పాఠశాల భవనాలు పూర్తి రక్షణతో విద్యార్థులకు చదువుకునేందుకు అనువుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తరగతి గదిలో గాలీ, వెలుతురు వెళ్లేలా ఉండటంతో పాటుగా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా రక్షణ చర్యలు ఉండాలి. నాగోలు సాయినగర్‌లోని శ్రీనాగార్జున పాఠశాలలో విద్యార్థి భవనంపై నుంచి పడిపోయి మరణించిన సంఘటన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ప్రతి పాఠశాలలో తనిఖీలు చేసి భవనాల్లో విద్యార్థుల భద్రతకు తగు ఏర్పాట్లు చేశారా లేదా అన్నది పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా నిపుణులు పేర్కొంటున్నారు.

ఎన్నెన్నో అనుమానాలు..
వీవిక పాఠశాలలోని ఏ అంతస్తు నుంచి కింద పడిందనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదవ అంతస్తులోని గ్రిల్స్‌లేని కిటికీ నుంచి కిందికి జారిపడిందా? లేక 5వ అంతస్తుపై ఉన్న టెర్రస్‌పై నుంచి కింద పడిందా? అనేది నిర్ధారణ కాలేదు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాగా, వీవిక తండ్రి నర్సింగ్‌రావు మాత్రం.. పాఠశాలలో ప్రార్థన ముగిసిన తర్వాత తరగతిలోకి వచ్చేందుకు మెట్లు ఎక్కుతుండగా రెయిలింగ్ లేకపోవడంతోనే కింద పడిందని ఆరోపిస్తున్నాడు. కానీ.. వీవిక పాఠశాలకు చేరుకుని తరగతి గదిలో బ్యాగుపెట్టి బయటకు వెళ్లడం చూశామని కొందరు పాఠశాల సిబ్బంది, సహ విద్యార్థులు చెబుతున్నారు. ఎక్కడి నుంచి కింద పడిందనే విషయం తెలియదని తెలిపారు. కూతురు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తండ్రి డిమాండ్ చేశారు. తన కూతురు పాఠశాల పైనుంచి కింద పడిన విషయం తనకు చెప్పకుండా గోప్యంగా ఉంచారని, ఉదయం 7:57 గంటలకు వీవిక కిందపడితే., 8:48 గంటలకు స్కూల్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారని తెలిపారు.

ఏది భద్రత ?
నాగార్జున విద్యా సంస్థలకు చెందిన ఈ పాఠశాలకు 2013 నుంచి పదేండ్లు 2023 వరకు అనుమతులు ఉన్నాయని ఎంఈఓ మదనాచారి తెలిపారు. అయితే నాగార్జున విద్యా సంస్థలకు సంబంధించిన ఈ పాఠశాలను గత ఏడాది నుంచే భవనం యజమాని, పాఠశాల నిర్వాహకుడు అయిన వెంకటేశ్వర్‌రెడ్డి వేరుగా తానే శ్రీనాగార్జున విద్యాసంస్థల పేరుతో నడుపుకుంటున్నాడు. అయితే విద్యాశాఖ అధికారులు గతం లో ఉన్న అనుమతులతోనే ఈ పాఠశాల నడుస్తున్నా, ప్రస్తుత పాఠశాలకు ముందు శ్రీ అని పెట్టుకున్నా కనీసం పాఠశాలను తనిఖీ చేయడం గానీ, పాఠశాల భద్రత విషయంలో సరైన చర్యలు తీసుకున్న దాఖలాలు కానీ లేకపోవడంతో గురువారం ఓ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. పాఠశాల ప్రారంభం నుంచి వీవిక ఇక్కడే చదువుకుంటున్నది. కాగా వందలాది మంది విద్యార్థులు చదువుకునే ఈ పాఠశాలలో యాజమాన్యం కనీస భద్రతా చర్యలు చేపట్టలేదు. ఐదవ అంతస్తులో ఉన్న పదవ తరగతి గదిలో ఓ కిటికీకి గ్రిల్స్ లేవు. భవనంపైకి వెళ్లకుండా ఎలాంటి డోర్‌ను అమర్చలేదు. ఈ ఫ్లోర్‌లోనే 8, 9, 10వ తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థులెవరైనా టెర్రస్‌పైకి అవలీలగా వెళ్లే పరిస్థితులున్నాయి. భవనానికి ఆనుకునే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. కిటికీలో నుంచి చేతులు బయటకు పెడితే విద్యుత్ వైర్లు తగిలే పరిస్థితులు ఉన్నాయి.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...