విద్యుదాఘాతానికి చిన్నారి బలి


Mon,May 20, 2019 04:04 AM

చాంద్రాయణగుట్ట, నమస్తే తెలంగాణ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ బాలిక బలి కాగా, మరో బాలిక అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం ఉప్పుగూడ డివిజన్ పరిధిలోని కృష్ణారెడ్డినగర్‌లో నరేందర్, రుక్మిణి దంపతులు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడితో కలిసి నివాసముంటున్నా రు. పెద్ద కూతురు లక్ష్మి(9), చిన్న కూతురు శ్రీనిధి(7) అక్కా చెల్లెలు పాఠశాలలకు సెలవులు కావడంతో రోజు మాదిరిగానే ఆదివారం మధ్యాహ్నం ఇంటిపై ఆడుకుంటున్నారు. ఇంటి రేలింగ్ సమీపంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు చిన్నారులిద్దరూ ఆడుకునే సమయంలో విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో లక్ష్మి కిందపడిపోగా, గమనించిన శ్రీనిథి గట్టిగా కేకలు వేస్తూ రక్షించడానికి ప్రయత్నించింది. చిన్నారి శ్రీనిధి కేకలు విన్న ఇంటి సమీపంలోని మహిళలు చిన్నారుల తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తూ భవనంపైకి పరుగులు తీశారు. అప్పటికే శ్రీనిధి అక్క లక్ష్మిని బలవంతగా పక్కకు లాగింది. దీంతో శ్రీనిథికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. లక్ష్మి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక దవాఖానకు తీసుకెళ్లారు. డాక్టర్ సలహా మేరకు లక్ష్మిని కుటుంబ సభ్యులు ఆటోలో ఉస్మానియా దవాఖానకు తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే లక్ష్మి మృతి చెందినట్లు నిర్ధారించారు. తన కూతురు లక్ష్మి మృతి చెందడానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చిన్నారి తల్లిదండ్రులు నరేందర్, రుక్మిణి ఆరోపించారు. సంఘటన జరిగిన వెంటనే ఎస్సై సాయికుమార్‌గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. విద్యుత్ అధికారులతో చర్చించి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...