ఘనంగా లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం


Sun,May 19, 2019 02:16 AM

- కనులపండువగాస్వామివారి కల్యాణం
- భారీగా హాజరై మొక్కుల సమర్పణ
- కల్యాణాన్ని కనులారా వీక్షించి పులకించిన భక్తులు
ఇబ్రహీంపట్నం, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం తరహాలోనే మండల కేంద్రంలోని లక్ష్మీనర్సింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామివారి కల్యాణాన్ని కన్నులారా వీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా పెద్దఎత్తున నిర్వహించే ఈ కల్యాణానికి గతంలో కంటే అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కోరిన కోర్కెలు తీర్చాలని మొక్కులు సమర్పించుకున్నారు. వేదమంత్రాలు, విద్యుత్‌కాంతుల నడుమ స్వామివారి కల్యాణాన్ని చూడముచ్చటగా నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. స్వామివారి కల్యాణం సందర్భంగా ఇబ్రహీంపట్నం రాజకీయపార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు.

రాయపోల్‌లో ఘనంగా స్వామివారి కల్యాణం
ఇబ్రహీంపట్నం రూరల్‌: మండలంలోని రాయపోల్‌లోని లక్ష్మీనర్సింహస్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం సందర్భంగా రాయపోల్‌, ముకునూరు, పోల్కంపల్లి, మన్నెగూడ, దండుమైలారం, నాగన్‌పల్లి గ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బల్వంత్‌రెడ్డి, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.


కొంగరకలాన్‌లో
ఆదిబట్ల: కొంగరకలాన్‌లో లక్ష్మీ నర్సింహస్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్‌లో స్వయంభువుగా వెలిసిన లక్ష్మీనృసింహస్వామి 68వ కల్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణం సందర్భంగా ఆలయాన్ని అందంగా ముస్తాబుచేశారు. కల్యాణ మంటపాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. స్వామి వారిని పట్టు వస్ర్తాలతో అలంకరించి పెడ్లి మంటపానికి వేదపండితులు తీసుకు వచ్చారు. స్వామి వారి కల్యాణ ఘట్టం రాత్రి 12 తర్వాత ముగిసింది. శనివారం ఉదయం నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...