రాజ్యాంగం ద్వారానే జాతినిర్మాణం సాధ్యం


Sat,May 18, 2019 01:19 AM

-సామాజిక సమస్యలపై లోతైన పరిశోధనలు జరగాలి
-యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్

ఉస్మానియా యూనివర్సిటీ, మే 17: రాజ్యాంగం ద్వారానే జాతి నిర్మాణం సాధ్యమని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్ అన్నారు. సామాజిక సమస్యలపై మరిన్ని లోతైన పరిశోధనలు జరగాలని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఓయూ మెయిన్ లైబ్రరీని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లైబ్రరీగా పేరు మార్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ థోరట్ హాజరయ్యారు పీజీఆర్‌ఆర్‌సీడీఈ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ -సామాజిక న్యాయం అనే అంశంపై ఆయన ప్రసంగించారు. దేశంలోని బడుగు, బలహీనవర్గాలు, మైనారిటీలపై మరిన్ని పరిశోధనలు చేయాలని సూచించారు. యూజీసీ చైర్మన్‌గా తన హయాంలో దేశవ్యాప్తంగా 32 పరిశోధనా కేంద్రాలను ప్రారంభించామని, కానీ అవి ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంటరానితనంపై ఆయన అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. అంబేద్కర్ మొదటి పరిశోధనా పత్రాన్ని కులం ఆధారిత అంశంపైనే రూపొందించారని పేర్కొన్నారు. ఆయన పేరుతో పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఓయూ అధికారులను అభినందించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ... అంబేద్కర్‌ను కేవలం ఒక కులానికే పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ అంబేద్కర్‌ను సింబల్ ఆఫ్ నాలెడ్జ్‌గా అభివర్ణించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు బోయిళ్ల విద్యాసాగర్, ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, ఓఎస్డీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ కృష్ణారావు, కళాశాలల ప్రిన్సిపాల్స్, డీన్లు, డైరెక్టర్లు, అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...